KTR | జగిత్యాల : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గాంధీని పూజిస్తావా..? గాడ్సేని పూజిస్తావా..? దమ్ముంటే నిజామాబాద్‌లో చెప్పాలని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన మొట్టమొదటి టెర్రరిస్టు భారతదేశంలో నాథూరామ్ గాడ్సే అనే ఒక వెధవ అని కేటీఆర్ మండిపడ్డారు. వాడిని ఆరాధించే దిక్కుమాలిన పార్టీ ఇవాళ మన దేశానికి అవసరమా? అని అడుగుతున్నాను. ఇలాంటి దుర్మార్గులతో పొత్తు పెట్టుకునే ఖర్మ మాకు లేనే లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఓటుకు నోటు దొంగను ఇవాళ పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న నక్కజిత్తుల కాంగ్రెసోళ్లు ఎన్ని మాటలు మాట్లాడినా నమ్మొద్దు. సంజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి.. పట్టణాన్ని, నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం. జగిత్యాలను రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీజేపీకి, బీఆర్ఎస్కు సంబంధం ఉందని ఇవాళ చాలా మంది అంటున్నారు.. ఇవాళ మోదీని కేసీఆర్ విమర్శించినంతా, బండకేసికొట్టినట్టుగా ఈ దేశంలో ఏ పార్టీ వ్యక్తి అయినా మాట్లాడిండా? ఒక్కసారి ఆలోచించండి అని కేటీఆర్ సూచించారు. మోదీ ఏం చేసిండని ఆయనతో అంటకాగేందుకు. 2014లో ఎన్నికల ముందు రోజు ఆయన ఏం చెప్పిండు. జన్‌ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పిండు.. ఎవరి ఖాతాలోనైనా పడ్డాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకూడదు. గుండుసున్నా పడాలి. ఆ పార్టీకి సిగ్గుశరం ఉందా? మోదీ దేవుడని బండి సంజయ్ చెబుతుండు. సిలిండర్ ధర, పెట్రోల్, నిత్యాసవరాలు పెంచినందుకా మోదీ దేవుడా? అని మంత్రి ప్రశ్నించారు.
పసుపు బోర్డు ఇచ్చామని మాకు ఓటు వేయాలని బీజేపోళ్లు అంటున్నారు.. పొరపాటున కూడా బీజేపీకి ఓటు వేయొద్దు అని కేటీఆర్ సూచించారు. అది దొంగ పార్టీ. మతపిచ్చి పార్టీ. హిందూ ముస్లిం పంచాయితీలు తప్పా.. ఇంకో పథకం, పనికొచ్చే పని చేయడం లేదు. ప్రజల కోసం, పేదల కోసం ఆలోచిచండం లేదు. మతం పేరు మీద చిచ్చుపెట్టడం.. నాలుగు ఓట్లు డబ్బాల వేసుకోవడం తప్ప మోదీ ఏం చేసిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు.. ఇప్పటి వరకు 9 ఏండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి యువతను మోసం చేశాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.