KTR | నిర్మల్ : కరెంట్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.
నిర్మల్ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దివాలాపూర్ మండలంలో రూ. 714 కోట్లతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతలకు ప్రారంభించుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రూ. 300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనం చేశాం. ఈ ఫ్యాక్టరీలో 300 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. నిర్మల్ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం అని మంత్రి తెలిపారు.
రెండు సార్లు కేసీఆర్‌ను ఆశీర్వదించి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడుపమని అవకాశం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. మళ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ తొమ్మిదినరేండ్లలో ఏం చేశామో.. మళ్లా ఎందుకు ఓటేయాలని కోరుతున్నామో.. చెప్పడానికి వచ్చాం. మేం చేసింది, చెప్పింది నిజమైతే కడుపు నిండా ఓట్లు వేయండి. ఒక వేళ మేం చెప్పింది తప్పయితే ఓట్లు వేయకండి.
2014లో కరెంట్, తాగు, సాగునీటి పరిస్థితి ఎట్ల ఉండే. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించి ఓటేయండి. నిర్మల్ పట్టణం అభివృద్ధి చెందింది. 2014కు ముందు ఏదైనా కష్టమొస్తే.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారుల దగ్గరకు వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిర్మల్‌లోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించుకున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ ఇక్కడకు వచ్చారు. మన కలెక్టరేట్లు ఉన్నట్లు.. ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవు అని కేటీఆర్ తెలిపారు.
2014కు ముందు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యేలకు భయం. ఎక్కడ కుండలు, బిందెలు అడ్డం పెడుతారో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. పదేండ్ల కింద 10 గంటలు కరెంట్ పోతే అడిగినోళ్లు లేరు. ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతే ఆగమైపోతున్నారు. ఒక్కటే గుర్తు చేస్తున్నా. 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదు. కేవలం కేసీఆర్ మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నది కరెంట్ మాకు కనబడుతలేదు అని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బస్సులు ఏర్పాటు చేస్తాం. ఏ ఊరికి పోతరో పోండి. ఏ టైంకు పోతరో పోండి. వరుసగా నిలబడి గట్టిగా కరెంట్ తీగలను పట్టుకోండి.. కరెంట్ వస్తుందో లేదో తేలిపోతది. రాష్ట్రానికి కూడా దరిద్ర్యం వదిలిపోతది. మాట్లాడానికి సిగ్గు శరం ఉండాలి. 2014కు పూర్వం కరెంట్ సమస్యలు ఉండేవి. కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె. రోజుకు 6 గంటల కరెంటని చెప్పి.. ఏనాడూ ఆరు గంటలు ఇవ్వలేదు. మూడు గంటలు ఒకసారి, మరోసారి మూడు గంటల కరెంట్ ఇచ్చేవారు. ఎరువులు, విత్తనాల కోసం పోలీసు స్టేషన్లు, దుకాణాల ముందు చెప్పుల లైన్లు దర్శనమిచ్చేవి. ఇవాళ కడుపు నిండా కరెంట్ ఇస్తున్నారు కేసీఆర్. నేను చెప్పేది వాస్తవమైతే మాకు ఓటేయండి.. తప్పయితే మీకు ఇష్టమున్నట్లు ఓటు వేసుకోండి అని కేటీఆర్ సూచించారు.