KTR | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్‌కు పోలికా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరు? 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపిందేవరు? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి, కాంగ్రెస్‌లో కలుపుకున్నది వాస్తవం కాదా..? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది వారు కాదా..? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు? అని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ సాధనలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పాత్రకు తేడా ఏందంటే.. బ్రిటిషోళ్ల మీద భారతీయులు కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు. బ్రిటిషోళ్లు మేం స్వాతంత్ర్యం ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్‌గా ఉంటది. అదొక్కటే కాదు.. నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటదో.. మాకు అంతే బాధ ఉంటది. మంత్రసాని పాత్ర పోషించిన వారే కాంగ్రెసోళ్లు. 1000 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్ రెడ్డి అన్నారు అని కేటీఆర్ తెలిపారు.