హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): హింసకు ప్రతి హింస సమాధానం కాదు కాబట్టే ఓపికగా ఉంటున్నామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను హెచ్చరించారు. బీజేపీ నేతలు తాము యుద్ధానికే దిగుతం.. హింసకు పాల్పడతామంటే తిప్పికొట్టే శక్తి, సత్తా టీఆర్ఎస్కు ఉన్నదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం పలిమెలలో బీజేపీ దాడిలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ను బుధవారం ఆయన హోంశాఖ మంత్రి మహమద్ అలీతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యను సృష్టించాలనే పలివెలలో ఈటల నాయకత్వంలో దాడికి పాల్పడ్డారని, ఆయన పీఏ నరేశ్తోపాటు దాడిచేసిన వారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ‘మీరు పిడికెడంత మంది ఉన్నారు. మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించం’ అని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇదే సంస్కృతిని కొనసాగిస్తే.. మేం మర్లబడక తప్పదని హెచ్చరించారు. ఎనిమిదేండ్లలో ఏమి చేశారో చెప్పుకొనే ముఖం లేదని, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా.. టీఆర్ఎస్ ఓటమి పాలవుతున్నది అని సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఫేక్ ఆడియోను బీజేపీ నేతలు సృష్టించారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి మించిన ఫేక్ దేశంలో మరొకరు లేరని చురకలేశారు. ఫేక్ ఆడియో, ఫేక్ వీడియోలను నమ్మవద్దని, విజ్ఞతతతో వ్యహరించాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.