రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా నేత కార్మికులు ఉద్యమించాలని, వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా సాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలని కోరాం. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. 11 చేనేత క్లస్టర్లు ఇవ్వాలన్నారు. మమ్మల్ని ఆదుకోవాలని కోరినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. రాష్ట్రంలోని నేత కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి. ఎదురు తిరగకుండా.. తర్వాత బాధపడితే లాభం ఉండదు. జీఎస్టీని పెంచి వస్త్ర వ్యాపార పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొద్దిరోజులు తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ బంద్పెట్టలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను, అక్కడున్న నేత కార్మికులను దృష్టిలో పెట్టుకుని, దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. అవసరమైతే నేతన్నలందరూ రోడ్డెక్కి ఉద్యమం చేయాలి. నేతన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సిరిసిల్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల రుణం తీర్చుకునే దాంట్లో భాగంగా ఈ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ. 16.5 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు. విద్యానగర్, గీతానగర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.