KTR | నిజామాబాద్ : రాష్ట్రంలో అధికారపక్షంలో అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే.. కాంగ్రెస్, బీజేపోళ్లకు ఢిల్లీలో బాసులు ఉన్నారని పేర్కొన్నారు. ఆఖరికి అది పోయాలన్నా కూడా ఢిల్లీకి పోవాలే అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీకి బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మాకు బాసులు ఎక్కడ్నో ఢిల్లీలో లేరు. గల్లీలో ఉన్నరు. మీరు ఇక్కడ చెప్పడం ఆలస్యం.. అక్కడ పనులు అవుతాయి. రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు ఆలోచన రాగానే కేసీఆర్ అమలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆలోచనకు రాగానే అమలు చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశారు. కేసీఆర్ కిట్లు అందుతున్నాయి. 24 గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచన రాగానే వెంటనే అమలు చేశారు. అదే ఈ ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇస్తే ఏమైతదో ఆలోచన చేయండని కేటీఆర్ సూచించారు.
బీజేపోడు, కాంగ్రెసోడు నిలబడాలంటే, కూర్చోవాలంటే ఢిల్లీకి పోవాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. వాళ్లు ఒక్క హామీ ఇవ్వాలన్నా.. దాన్ని అమలు చేయాలన్నా ఢిల్లీకి పోవాలి. వాళ్లు నోరు తెరవాలంటే.. తెరిచిన నోరు మూయాలంటే కూడా ఢిల్లీకి పోవాలి. ఎన్నికల్లో సీటు కావాలంటే ఢిల్లీ పోవాలి. గాంధీ భవన్ గేటు దాటాలంటే ఢిల్లీ పోవాలి. ఒక రోడ్డు వేయాలంటే ఢిల్లీకి పోవాలి. అదే రోడ్డు మీద కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు తన్నుకుంటే,ఆ పంచాయితీ కూడా ఢిల్లీకి పోవాలి. చివరకు కూర్చోవాలన్నా ఢిల్లీ.. నిల్చోవాలన్నా ఢిల్లీ పోవాలి. ఆఖరికి ఉచ్చ పోయాలన్నా ఢిల్లీకి పోవాలి. ఈ గబ్బుగాళ్లు నలుగురు ఒక దగ్గర కూర్చోలేరు కానీ.. ఇవాళ కేసీఆర్ను ఓడగొట్టి, ఏదో పీకి పందిరి వేస్తామని చెప్పి మళ్లా లొల్లి పెడుతున్నారు. ఢిల్లీ బానిసలైనా కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ ఈ రాబోయే ఎన్నిక. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.