KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ వదిలిన బాణాలు.. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. మాదేమో గల్లీ పార్టీ.. సింగిల్ విండో చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మా నాయకుడు. వారిది ఢిల్లీ పార్టీ. ప్రభుత్వంలో, పార్టీలో నిర్ణయం తీసుకోవాలంటే.. ధైర్యం, సాహసం, తెగువ, తెలివి, స్వేచ్ఛ, స్వతంత్రం, వెన్నెముక ఉన్న నాయకుడు మాకున్నాడు. నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ది మెరుపు వేగం. అమలు చేయడంలో రాకెట్ స్పీడ్. రైతుబంధు, దళితబంధు ఆచరణ క్షణాల్లో అమలైపోయింది. కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలు ఢిల్లీలో ఉంటాయి. ఈ లోపు ప్రజలు ఇక్కడ చస్తారు. కాంగ్రెస్, బీజేపీనో అధికారంలోకి వస్తే.. ప్రతి దానికి ఛలో ఢిల్లీ అంటారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ వదిలిన బాణాలు. కానీ తెలంగాణ గల్లీ నుంచి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం కేసీఆర్. అందుకే నిర్ణయాలు మెరుపువేగంతో జరుగుతున్నాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. రాజకీయాలు, ప్రజాజీవితం అంటే టెన్ జన్‌పథ్ కాదు.. తెలంగాణ జనపథంతో కలిసి కదం తొక్కితే అప్పుడు ఆదరణ ఉంటది కానీ, టెన్ జన్‌పథ్ చుట్టూ చక్కర్లు కొడితే మీ వల్ల ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.