Minister KTR | పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంపై మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బీఆర్ఎస్ వద్దనుకొని.. సస్పెండ్ చేస్తేనే వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని విమర్శించారు. వాళ్లెవరికీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఛాయిస్ కాదని అన్నారు. మా చుట్టూ తిరిగి, పార్టీ టికెట్ అడిగి, చివరకు ఆశ్రయం దొరక్కపోతేనే వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని స్పష్టం చేశారు.
మేం వదిలించుకున్న వాళ్లను నెత్తిన పెట్టుకుని.. అదెదో గొప్ప విజయంగా కాంగ్రెస్ నాయకులు ఊరేగుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తానంటే వద్దనుకుని ఆ పార్టీలోకి వెళ్లిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో హర్షవర్దన్‌రెడ్డికి టికెట్ ఇస్తారని అర్థమైన తర్వాతనే జూపల్లి పార్టీ మారారని స్పష్టం చేశారు. పొంగులేటి కూడా ఇక్కడ ఆశ్రయం లేదని అర్థమయ్యాకే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరికీ టికెట్ ఇస్తే పార్టీ మారే వాళ్లా అని ప్రశ్నించారు. వాళ్లకు కాంగ్రెస్ సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్ మాత్రమేనని తెలిపారు. అటు ఇటు తిరిగి ఏ దిక్కు లేకపోవడం వల్లనే వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఫస్ట్ ఛాయిస్‌గా.. అది గొప్ప పార్టీ అని భావించి అందులోకి వెళ్లే నేతలు ఈ దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు.