హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన పన్నాగమని మండిపడ్డా రు. మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జనగణన, మై నార్టీల జనగణన నిర్వహించి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని మైనార్టీ డిక్లరేషన్‌లో పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భారత రాజ్యాంగమే ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లను మతపరమైన అల్పసంఖ్యాకులుగా గుర్తించి, మైనార్టీ హోదా కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా జనగణన నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇది అటు బలహీన వర్గాలకు, ఇటు మైనార్టీలకు తీవ్ర నష్టం కలిగించడంతోపాటు, రెండు వర్గాల మధ్య పంచాయితీ పెట్టే కుట్ర అని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని, వ్యతిరేకిస్తున్నామని చెప్పా రు. ‘మైనార్టీలను బీసీల్లో కలిపితే వారు మైనార్టీ హోదా కోల్పోతారు. అప్పుడు మైనార్టీ సంక్షేమశాఖ, మైనార్టీ సంక్షేమ కమిషన్, కార్పొరేషన్ వంటివేమీ ఉండవు. మరోవైపు మైనార్టీలను బీసీల్లో కలిపితే బీసీల రిజర్వేషన్లకు నష్టం కలుగుతుంది. ఆ తర్వాత బీసీ సంఘాలు, కుల సం ఘాల నాయకులు తమకు నష్టం కలుగుతున్న దంటూ ఆందోళనలు చేస్తారు, కోర్టులను ఆశ్రయిస్తారు. మొత్తంగా ఇది బీసీలకు, మైనార్టీల మధ్య పెద్ద వివాదంగా మారుతుంది’ అని వివరించారు. కాంగ్రెస్ వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ముస్లింలు, సిక్కు లు, క్రిస్టియన్లు, బలహీనవవర్గాలు ఈ ప్రతిపా దనను ఖండించాలని పిలుపునిచ్చారు. మైనార్టీలు ఈ డిక్లరేషన్‌ను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లేస్తే.. మైనార్టీ హోదా కోల్పోతారని హెచ్చరించారు.
కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ బీజేపీ ఆఫీస్‌లో తయారైందని కేటీఆర్ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది ఆరెస్సెస్ భావజాలమని, బీజేపీ నేతలు ‘పాస్మాందా ముసల్మాన్’ అని నినాదం ఇస్తున్నారని, కాంగ్రెస్ బీసీల్లో కలిపే కుట్ర చేస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించే డిక్లరేషన్లు చిత్తు కాగితాలతో సమానమని అన్నారు. కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని తీర్మానం చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు.. ఇలా అనేక కుటుంబాలకు రెండు టిక్కెట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు. ‘సొంత పార్టీలోనే డిక్లరేషన్ అమలు చేయడం చేతగానివాడు… దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తాడు?’ అని ప్రశ్నించారు.
భారత రాజ్యాంగమే ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లను మతపరమైన అల్పసంఖ్యాకులుగా గుర్తించింది. మైనార్టీ హోదా కల్పించింది. కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా జనగణన నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది.
– మంత్రి కేటీఆర్
మైనార్టీ సంక్షేమంపై కాంగ్రెస్‌కు ఏనాడూ చిత్తశుద్ధి లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మైనార్టీల కోసం చేసిన ఖర్చు కేవలం 930 కోట్లు అని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, 2014 నుంచి ఇప్పటివరకు పదేండ్లలో 10,140 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్‌ను రూ.4 వేల కోట్లు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే మైనార్టీ సంక్షేమ బడ్జెట్ రాబోయే ఐదేండ్లలో ఆటోమెటిక్‌గా రూ.5 వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో రూ.4 వేల కోట్లు ఇస్తామని చెప్తున్న నేతలు దేశంలోని ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఆ మేరకు బడ్జెట్ పెడుతున్నారేమో చెప్పాలని సవాల్ విసిరారు. కర్ణాటకలో సుమారు కోటి మంది మైనార్టీలు ఉంటే బడ్జెట్ 2100 కోట్లుగా ఉన్నదని, రాజస్థాన్‌లో సుమారు 60 లక్షల మంది మైనార్టీలు ఉంటే 2100 కోట్లు కేటాయించారని, యూపీలో 4 కోట్ల మందికి రూ.1780 కోట్లు, పశ్చిమ బెంగాల్లో కోటిన్నర మంది ఉంటే 2100 కోట్లు, మహారాష్ట్రలో 670 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. తెలంగాణలో మైనార్టీలు సుమారు 25 లక్షల మంది మాత్రమే ఉన్నారని, తమ ప్రభుత్వం 2,200 కోట్లు కేటాయిస్తున్నదని వెల్లడించా రు. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందులో చదివే పిల్లల కోసం ఏటా 700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. షాదీముబారక్ ద్వారా 2.17 లక్షల మందికి సాయం చేశామని వివరించారు.
మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని 2017 ఏప్రిల్ 14న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ఈ బిల్లును తిరస్కరించిందని చెప్పారు. దీనిని మతపరమైన రిజర్వేషన్‌గా గుర్తించకుండా, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కోణంలో ఆలోచించి రిజర్వేషన్ ఇవ్వాలని కోరామని తెలిపారు. 2024లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే సెక్యులర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే దేశవ్యాప్తంగా మైనార్టీ రిజర్వేషన్‌ను 12 శాతానికి పెంచుతామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2004 డిసెంబర్ 17న నాటి కేంద్రమంత్రిగా సీఎం కేసీఆర్ ఉమ్మడి ఏపీకి చెందిన బీసీ సంఘాల నేతలను తీసుకొని ప్రధానిని కలిసి ఓబీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని కోరారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 2014 వరకు ఓబీసీ శాఖను ఎందుకు పెట్టలేదనని ప్రశ్నించారు. బీసీ పీఎం అని చెప్పుకునే మోదీ కూడా పదేండ్లుగా ఎందుకు నియమించలేదని నిలదీశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. పదేండ్లలో 10,140 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్‌ను రూ.4 వేల కోట్లు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం.
– మంత్రి కేటీఆర్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ విమర్శించారు. రాజాసిం గ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను నిలిపిందని ఆరోపించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమని అన్నారు. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్లో గెలిచిందని, ఈ సారి ఒక్క సీటు కూ డా గెలువనీయమని స్పష్టం చేశారు. గోషామహల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగి రాజాసింగ్‌ను ఓడిస్తామని పేర్కొన్నారు. రేవంత్, రాజాసింగ్, ఈటలను ఓడిస్తామని సవాల్ చే శారు. సీఎం కేసీఆర్ మీద పోటీ చేయడం అం టే పోచమ్మగుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేన ని అన్నారు. 2018లో కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇప్పుడు కామారెడ్డిలో చెల్లుతుం దా? అని రేవంత్‌ను ఎద్దేవా చేశారు. ఆయన కొడంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేండర్రెడ్డి చేతిలో ఓడిపోతే చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుందని, కామారెడ్డిలో ఓడిపోయి సీఎం చేతిలో ఓడిపోయానని గొప్పగా చెప్పుకోవడానికే పోటీ చేస్తున్నారని అన్నారు.
ఇమామ్‌లకు, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణలో రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్నామని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో ఎక్కడైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మరోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఇంతియాజ్, సలీం మసిఉల్లా తదితరులు పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఈ సారి ఒక్క సీటు కూడా గెలువనీయం. గోషామహల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగి రాజాసింగ్‌ను ఓడిస్తాం. రేవంత్, రాజాసింగ్, ఈటలను ఓడిస్తాం.
– మంత్రి కేటీఆర్