KTR | రాజన్న సిరిసిల్ల : ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు.. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందు పోయించను.. పైసలు పంచను. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో బీసీ బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఓట్ల కోసం విపక్ష నేతలు వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలి. 50 ఏండ్లుగా చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని నిలదీయాలి. ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు చైతన్యం ప్రదర్శించాలి. పని చేసే ప్రభుత్వాలను ప్రజలు కాపాడుకోవాలి. ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచేవారిని నమ్మొద్దు. ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు.. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందు పోయించను.. పైసలు పంచను. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను. మందు పోయించి.. పైసలు పంచే చిల్లర రాజకీయం చేయను. ప్రజలందరికీ అండగా ఉండే బాధ్యత నాది. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి డోకా లేదు. సెప్టెంబర్లో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారని కేటీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. శతాబ్దాలుగా అత్యంత అట్టడుగున ఉన్నది దళితులు. దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. బీసీ, ఎంబీసీల్లోని 14 కులవృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష సాయం అందిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెలలో 600 మంది లబ్దిదారులకు రూ. లక్ష చొప్పున సాయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి రూ. లక్ష చొప్పున సాయం ఇస్తామన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 10 వేల మందికి లక్ష సాయం తప్పకుండా అందించి తీరుతాం. దళితులు, బీసీలకు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం త్వరలోనే అందజేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం తిరిగి కట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి మొదలుకుంటే.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. పేదల మీద కేసీఆర్కు ఉన్న ప్రేమ ఇతరులకు ఎవ్వరికీ లేదన్నారు. ప్రతి పథకం లబ్దిదారులకు నేరుగా అందుతుంది. ఎవరూ అడక్కున్నా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. భర్త చనిపోతే భార్య పేరు మీదికి ఆసరా పెన్షన్ వెంటనే మార్పు చేయాలి. గృహలక్ష్మి పథకం రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.