హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులనుఅభినందించాల్సింది పోయి ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మడం సిగ్గుచేటని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ.. సమ్మక, సారలమ్మ సాక్షిగా గిరిజనులకు అన్యాయం చేశారని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్‌ను పట్టించుకోలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్‌పై బురద జల్లెందుకే వరంగల్‌లో బీజేపీ విజయ్ సంకల్ప సభ నిర్వహించిందని మండిపడ్డారు. ప్రధాని రాకను ప్రజలు వ్యతిరేకించారని, స్థానిక నేతలను సంతృప్తి పరిచేందుకే వరంగల్ సభకు హాజరయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఏ మేలు చేస్తారో చెప్పలేదని, కొత్త పథకాలు కూడా ప్రకటించలేదని మండిపడ్డారు.