హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/ధర్మపురి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 4కోట్ల మంది తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందని పేర్కొన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి కేసీఆర్ సిద్ధపడ్డారని, నేడు పార్టీ కోసం కన్నబిడ్డను కూడా సస్పెండ్ చేసిన గొప్ప నాయకుడు అని తెలిపారు. గతంలోనూ పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా ఇలాంటి చర్యలే తీసుకున్నారని తెలిపారు.
పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడినందుకే కవితపై కేసీఆర్ కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయంతో కేసీఆర్ నాయకత్వ పటిమ, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభ, బయట బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర జరుగుతున్న సమయంలో.. కవిత మాట్లాడిన మాటలు శత్రువు చేసే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని తెలిపారు. ప్రజలతో మమేకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్‌రావుపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.