న్యూఢిల్లీ : ఇంటి పెద్దను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని విషాదమే. ఆ బాధను దిగమింగుకున్నా రుణాల చెల్లింపులు, కుటుంబాన్ని నెట్టుకురావడం మిగిలిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అసలు ఇంటి పెద్ద మరణిస్తే రుణాల చెల్లింపుల పరిస్థితి ఏమిటనే దానిపై అవగాహన కొరవడింది. అయితే రుణ క్యాటగిరీ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆయా రుణాలను రికవరీ చేపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..
హోంలోన్ : హోంలోన్ దీర్ఘకాల రుణం కావడంతో రికవరీ ప్రక్రియకు విఘాతం కలగకుండా లెండర్స్ జాగ్రత్తలు పాటిస్తారు. రుణగ్రహీతతో పాటు రుణ సహ దరఖాస్తుదారు ఉండేలా చూసుకుంటారు. రుణ గ్రహీత మరణించిన సందర్భంలో సహ దరఖాస్తుదారు జీవించి ఉంటే రుణాన్ని అతడు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి బ్యాంక్ ఖాతా రుణ రీపేమెంట్ కు లింక్ చేసి ఉంటే దాన్ని సహ దరఖాస్తుదారు ఖాతాకు మళ్లిస్తారు. రుణ గ్రహీత లెండర్ నుంచి గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తే బీమా కంపెనీకి క్లెయిమ్ చేయడం ద్వారా రుణ మొత్తాన్ని రుణ దాతలు రికవరీ చేసుకుంటారు.
రుణం నుంచి సదరు మొత్తాన్ని తగ్గించగా మిగిలిన బకాయిని సహ దరఖాస్తుదారు చెల్లించాల్సి ఉంటుంది. రుణ బకాయి కంటే క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటే నామినీకి అదనపు సొమ్మును ఇన్సూరర్ చెల్లిస్తారు. సహ దరఖాస్తుదారు లేకుంటే రుణ గ్రహీత వారసులు రుణ ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుంది. వారు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు విముఖత చూపితే సర్ఫేసి చట్టం కింద ఇంటిని వేలం వేయడం ద్వారా లెండర్లు తమ రుణాన్ని రికవరీ చేసేందుకు మొగ్గుచూపుతారు.
వ్యక్తిగత రుణం : వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డులు అన్ సెక్యూర్డ్ లోన్ లు కావడంతో రుణగ్రహీత లేదా కార్డుదారుడు మరణిస్తే ఆయా రుణాలను రుణదాతలు రద్దు చేస్తారు. ఈ రుణాలను చెల్లించాలని వారసులను బాధ్యుల్ని చేసేలా ఎలాంటి నిబంధనలు లేవని లోన్ ట్యాప్ సీఈవో, సహ వ్యవస్ధాపకులు సత్యం కుమార్ తెలిపారు.
వ్యక్తిగత రుణాలకు బీమా పాలసీ ఉండేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొగ్గుచూపుతాయని, రుణ గ్రహీత మరణిస్తే ఇన్సూరర్ నుంచి క్లెయిమ్ పొందడం ద్వారా రికవరీ చేపడతాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆయా రుణాల చెల్లింపుకు ముందుకు వస్తే రుణ దాతలు చార్జీలు, పెనాల్టీలను ఎత్తివేస్తాయని, రుణ మొత్తాన్ని కూడా కుదించేందుకు అంగీకరిస్తాయని బ్యాంకర్ అధీర్ ధర్ చెప్పారు.
వాహన రుణం : రుణ గ్రహీత రుణంపై కారు, బైక్ కొనుగోలు చేసిన సందర్భంలో వాహనం రుణ దాత వద్ద తనఖా పెడతారు. రుణ గ్రహీత మరణిస్తే కుటుంబ సభ్యులు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అందుకు కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో వాహనాన్ని వేలం వేయడం ద్వారా లెండర్ తన రుణాన్ని రికవరీ చేసుకోవచ్చు. వారసులు ఈఎంఐ చెల్లించేందుకు సిద్దపడితే వారి పేరుపై న్యూ లోన్ ను జారీ చేస్తూ వాహన యాజమాన్య హక్కులను సంక్రమింపచేస్తుంది.
విద్యా రుణం : విద్యా రుణాన్ని హామీదారు లేకుండా మంజూరు చేసేందుకు లెండర్లు ఆసక్తి చూపడం లేదు. రుణ మొత్తం నిర్ధిష్ట పరిమితి దాటితే విద్యార్ధుల తల్లితండ్రులు కూడా ష్యూరిటీలు సమర్పించాలి. రుణ గ్రహీత మరణిస్తే బ్యాంకులు రుణ మొత్తం చెల్లించాలని హామీదారు (తల్లితండ్రులు)లను కోరతాయి. రుణాన్ని హామీదారు చెల్లించలేని పక్షంలో హామీగా ఉంచిన ఆస్తుల వేలం చేపట్టడం ద్వారా ఆర్థిక సంస్థలు రుణాలను రికవరీ చేసుకుంటాయి.