హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన దుర్మార్గానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల కుట్రదారు బండి సంజయ్ అనే విషయం తేటతెల్లమైందని చెప్పారు. బండిని పోలీసులు అరెస్టు చేయగానే ఢిల్లీ పెద్దలు ఒకరి తరువాత ఒకరు పరామర్శలు, మీడియా సమావేశాలు నిర్వహించి వారి పార్టీ శ్రేణులను ఉసిగొల్పటంలోనే లీకేజీలో బీజేపీ కుట్ర తేటతెల్లం అయిందని అన్నారు. దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. బుధవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పేపర్ లీకేజీలో భాగస్వాములైనవారు ఎంతటివారైనా ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చిచెప్పారు. రాజకీయాల కోసం లక్షల మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన బీజేపీని ప్రజలెవరూ క్షమించరని అన్నారు. రాష్ట్రంలో తక్షణమే అధికారంలోకి రావాలనే యావతో బీజేపీ ఇదంతా చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకేజీ చేసిన వ్యక్తులు బీజేపీ నాయకులేనని తేలిందని చెప్పారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలె కానీ చిన్నపిల్లలను, ఉద్యోగార్థులతో రాజకీయాలు చేయటం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేయత్నం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నది. ప్రశ్నపత్రాల లీకేజీలతో బీజేపీ అసలు రంగు బయట పడింది. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి ప్రశాంత్ సెల్‌ఫోన్ నుంచి బండి సంజయ్‌కు వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఎందుకు పంపాల్సి వచ్చింది? ఎన్నికలు సమీపిస్తుండటంతో అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నది. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్, నిన్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణం ఉన్నది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది.
-న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
విద్యార్థుల జీవితాలతో రాక్షస క్రీడనా?
పేపర్ లీకేజీలతో బీజేపీకి సంబంధం లేకపోతే తక్షణమే బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించాలి. బండి సంజయ్ అడ్డంగా దొరికినా బీజేపీ చర్యలు తీసుకోకపోతే అందరూ కలిసి చేసిన కుట్రలానే భావించాల్సి వస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలు, వారి తల్లిదండ్రుల మానసిక పరిస్థితులతో రాక్షస క్రీడకు తెరలేపడం దుర్మార్గం. లీకేజీలతో బీజేపీ నవ్వుల పాలైంది.
– విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
పేపర్ లీకేజీ వెనుక బీజేపీ కుట్ర
విద్యార్థుల జీవితాలతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలను బహిర్గతంలో బీజేపీ నాయకుల కుట్రలు ఉన్నాయి. టెన్త్ హిందీ పేపర్ లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే పార్టీ అధ్యక్షుడికి ఫోన్లో పంపించడం, ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇవ్వడం ఇదంతా కుట్రలో భాగమే. దీనివెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నది.
-క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
లీకేజీలు చేసేది వాళ్లే.. విమర్శలు చేసేది వాళ్లే
పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం ఫొటో పంపించాడు. వాళ్లే ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తారు. వాళ్లే మీడియాకు పంపిస్తారు. పేపర్ లీక్ అయ్యిందని అంటారు. ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేస్తారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటమాడటమే.
-రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
పేపర్ లీకేజీపై ప్రత్యక్ష ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని నిరూపించుకోవాలి. లక్షల మంది విద్యార్థులు, వేల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడటం ఆడినవారిని కఠినంగా శిక్షించాలి. పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటికి వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్టు వస్తున్న వార్తలు అందోళనకరం.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నూరు శాతం ప్రీ ప్లాన్ లీకేజీలే
టీఎస్పీఎస్సీ నుంచి మొదలు పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీల వరకు అన్నీ బీజేపీ ప్రీ ప్లాన్ కుట్రలే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వస్తే పోలీసులకు సమాచారం అందించకుండా రాద్ధాంతం చేయడంలో అంతర్యమేంటి? బీజేపీ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేయడం వెనుక బీజేపీ, సంజయ్ కుట్రలు బయట పడుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి, టెన్త్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి బూరం ప్రశాంత్‌తో బండికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
– పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
నిజాయితీపరుడైతే ఫోన్ ఎందుకు ఇవ్వలేదు?
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నది. ప్లాన్ ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆధారాలతో దొరికాడు. బండి ఫోన్ లేదనడం ఎంత వరకు సమంజసం? నిజాయితీపరుడైతే ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? ఫోన్ ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో ఇవ్వడం లేదు. కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ. ప్రశ్నపత్రాల లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నది. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోము.
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు