కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ: నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడెలను తీసుకెళ్లి, వాటిని కబేళాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారా? వారికి అండదండలు అందిస్తున్నారా? ఫలితంగానే సదరు వ్యాపారులు కబేళాకు కోడెలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నది.
తాజాగా గీసుకొండ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు, ముగ్గురి రిమాండ్, దాని వెనుక నడిచిన కథను పరిశీలిస్తే.. ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ‘రాజన్న కోడెలు కోతకు?!’ శీర్షికన ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చివరకు గీసుకొండ పోలీసుల విచారణలో సైతం కళ్లు బైర్లు కమ్మే నిజాలు బహిర్గతమయ్యాయి. మరోవైపు, వేములవాడ ఆలయ అధికారులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విచారణ మొదలు పెట్టగా, మరో 18 కోడెల లెక్కలు దొరకడం లేదని సమాచారం.
‘రాజన్న కోడెలు కోతకు?!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. ‘వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన కోడెలను అక్రమంగా విక్రయించినట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని, అవన్నీ పుకార్లేనని తెలిపారు. సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని సంబంధింత అధికారులకు సూచిస్తానని, కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా అదే విధంగా పంపించానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని, దేవస్థానంలోని ప్రతి కోడెకూ శాశ్వతమైన ట్యాగ్ ఉంటుందని, ట్యాగ్లున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదంటూ చెప్పారు. అంతేకాకుండా, తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ హైడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఈ నెల 9న మంత్రి సురేఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మాదాసి రాంబాబు అనే కాంగ్రెస్ నాయకుడు ఈ వ్యాపారాన్ని చాలాకాలం నుంచి చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇతను రాజరాజేశ్వర సొసైటీ పేరుతో ఈ దందాను నడుపుతున్నట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఈ అసలు ఈ సొసైటీనే బోగస్ అని తెలుస్తున్నది. అటువంటి సొసైటీ పేరుతో 12 ఆగస్టు 2024న తనకు గోశాల ఉన్నదని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయం నుంచి దూడలు, కోడెలను కేటాయించాలని కోరుతూ మంత్రి కొండా సురేఖకు రాంబాబు దరఖాస్తు చేశారు.
సదరు దరఖాస్తును వేములవాడ దేవస్థానం ఈవోకు 16 ఆగస్టు 2024న ఎండార్స్మెంట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ సంతకం చేసి పంపించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మే నుంచే వేములాడ దేవాలయ కోడెలను రైతులకు నేరుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి స్వయంగా తెలిపారు. అలాంటప్పుడు గోశాలకు కేటాయించాలంటూ అర్జీ పెడితే ఎలా ఎండార్స్ చేశారు? ఆ దరఖాస్తును చదువలేదా? లేక రైతులకే ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకోకుండా ఎండార్స్ చేశారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా పత్రికల్లో ఏవైనా కథనాలు వస్తే సదరు మంత్రులు లేదా ప్రభుత్వం లే దా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారు. అందులో వె ల్లడైన నిజానిజాలను బట్టి వివరణ ఇస్తారు. కానీ, రాజన్న కోడెల విక్రయాల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ ముందస్తుగానే సర్టిఫికెట్ ఇచ్చారు. వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని, ఎటువంటి అక్రమాలు జరగలేదని అప్పడే తేల్చిచెప్పారు.
అప్పటికే గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ పూర్వపరాలను కూడా తెలుసుకోకుండా మంత్రి హడావుడిగా ప్రకటన జారీ చేయడమే కాకుండా.. ఆ మరుసటిరోజే కోడెల వి క్రయాలపై కథనాలు రాసిన, సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీ సుకోవాలంటూ మంత్రి కార్యాలయ సిబ్బం ది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో తాజాగా గీసుకొండ పోలీసులు మా త్రం అక్రమ విక్రయాలు జరిగినమాట వాస్తవమేనని తేల్చారు.
అంతేకాదు, ముగ్గురు వ్యక్తులు (గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన మాదాసి రాంబాబు ఇదే మండలం అనంతారం గ్రామానికి చెందిన మంద స్వామి, దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునూటి శ్యామ్‌సుందర్) వివిధ రైతుల పేరుతో 66 కోడెలను తీసుకొచ్చి, 28 కోడెలను కబేళాకు అమ్మారని, మరో 26 కోడెలను వేములవాడలో అప్పగించారని, మూడు చనిపోగా, తొమ్మిదింటిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పం పారు.
పోలీసుల విచారణలో కొంత ఆల స్యం జరిగినా చివరకు నిగ్గు తేల్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ చెప్పి నా.. పోలీసులు మాత్రం విచారణను కొనసాగించి కబేళాకు అమ్మిన మాట వాస్తవమేనంటూ ఆధారాలు బయటపెట్టడం గమనా ర్హం. నిజానికి నవంబర్ 25న లోకల్‌గా, 26 న వరంగల్ సీపీకి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే తీసుకెళ్లిన కోడెల్లో ముందస్తుగా నవంబర్ 27న 26 కోడెలను సదరు వ్యక్తులు దేవాలయ అధికారులకు తిరిగి వాపస్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయం బయటకు రాకపోతే అన్ని కోడెలు కబేళాకే వెళ్లేవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేములవాడ, డిసెంబర్ 11: రాజన్న కోడెలను మంత్రి కొండా సురేఖ అక్రమంగా తన అనుచరులకు ఇప్పించినందున వెంటనే ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు బుధవారం వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ సిఫారసు లెటర్ ద్వారానే ఆమె అనుచరుడు రాంబాబుతోపాటు మరో ఇద్దరు వేములవాడ రాజన్న గోశాల నుంచి 66 కోడెలను అక్రమంగా తీసుకెళ్లినట్టు పోలీసులు తేల్చారని తెలిపారు.
ఇందులో 28 కోడెలను కోతకు అమ్మగా, 26 కోడెలను తిరిగి ఇవ్వడమే కాకుండా మూడు చనిపోయాయని, మిగిలిన తొమ్మిది కోడెలను స్వాధీనం చేసుకున్నామని అకడి పోలీసులు మీడియాకు వెల్లడించారని తెలిపారు. అక్రమాలు జరిగిన విషయాన్ని పోలీసులు నిర్ధారించి నిందితులను జైలుకు పంపిన విషయం ఇప్పటికైనా తెలిసిందా? అని మంత్రిని ప్రశ్నించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే కోడెలను తన సిఫారసు లేఖ ద్వారా కబేళాకు తరలించే వ్యక్తికి ఇప్పించిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కూడా కోడెల అక్రమ వ్యవహారంపై స్పందించాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంపిణీ వెనుక జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకునే దాకా పోరాడుతామని స్పష్టంచేశారు. రాజన్న సన్నిధిలో భక్తుల మనోభావాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కౌన్సిలర్ మహేశ్, బీఆర్ఎస్ నాయకులు మల్లేశం, చేపూరి రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.