హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఆలయ భూముల జియో ట్యాగింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్రమణకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ చెప్పారు. ఆలయ భూముల వివాదాల పరిషారానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతోపాటు, సమర్థులైన న్యాయ నిపుణులను నియమించాలని తెలిపారు.
రాష్ట్రంలోని 15 వేల ఎకరాల భూములకు జియో ట్యాగింగ్ చేపట్టినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భూముల లీజు వివరాలపై ఆరా తీసిన మంత్రి బకాయిలన్నింటినీ త్వరగా రాబట్టాలని ఆదేశించారు. ధరణిలో భూముల వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సంబంధిత ఆలయాల పేరిట పాస్‌బుక్‌లు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆలయ భూముల్లో ఫంక్షన్‌హాళ్లు, ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టడం ద్వారా భూములకు రక్షణతోపాటు, ఆదాయం సమకూరుతుందని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆలయాల స్థల పురాణం, ప్రాశస్త్యం తదితర వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వెబ్సైట్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. ఆషాఢ బోనాల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బ్రాహ్మణ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ నర్సింహమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన ఆలయాల ఈవోలు పాల్గొన్నారు.