హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు తన సందేశమిచ్చారు. ప్రపంచంలో ప్రత్యేకమైన శీతోష్ణస్థితి పరిస్థితులు కలిగి జీవించడానికి అనువైన భూమిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి అని మంత్రి గుర్తుచేశారు. విచక్షణ మరిచి మనిషి తన అవసరాలు తీర్చుకోవడమే లక్ష్యంగా సాగిస్తున్న కార్యకలాపాలు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
అకాల వర్షాలు, కరువు కాటకాలు, వరదలు, పలు జీవజాతుల అంతర్థానం, భూతాపం, సముద్రమట్టాల పెరుగుదల, రుతువుల్లో అవాంఛనీయ మార్పులు వంటి ప్రతికూల పరిస్థితులు మానవాళిని ప్రమాదంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ వైపరీత్యాలు ఇలాగే సాగితే మానవాళి మొత్తం వినాశనం దిశగా పయనించే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాచరణకు తోడు ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవ’ స్ఫూర్తిని ఏడాది పొడవునా ప్రదర్శిస్తూ, పచ్చదనం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒకరూ కలిసి రావాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.