నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని పేర్కొంటూ ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదిదారుడు నాగార్జున సైతం కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. నెట్వర్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో గురువారం ఆరోగ్యశ్రీ సీఈవో శివశంకర్ చర్చలు జరిపారు. రోగులకు ఇబ్బంది కలిగించకుండా వైద్యసేవలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిగా ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటళ్లకు రూ.1130 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. 2013 నుంచి పెండింగ్ ప్యాకేజీల రేట్లను సవరించినట్టు తెలిపారు. పెండింగ్ బిల్లుల అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.