తిప్పర్తి,డిసెంబర్5: నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరియాదవ్కు రక్షణ కల్పించి, దాడులు బెదిరింపులకు దిగిన ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని మాజీ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్, మేకల,గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు. చలో ఎల్లమ్మగూడెం కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, బీసీ సంఘాలు, యాదవ సంఘాలను కలుపుకొని బాధితుడు యాదగిరి, అతడిభార్య, సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మిని పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీసీల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఘటనకు కారకులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసుతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు పోటీ చేసే స్వేచ్ఛ లేదా.. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీతోపాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 10న అసెంబ్లీ గన్ పార్ దగ్గర ధర్నాలో అన్ని పార్టీలు, సంఘాలు పాల్గొనాలని కోరారు.