నల్లగొండ : రైతు సంక్షేమ కోసం(Farmers welfare) రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా(Nallagonda) కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండుతుందని, రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఎస్ఎల్బీసీ వద్ద గతంలో బత్తాయి పండ్ల కోసం నిర్మించిన షెడ్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు. అనంతపూర్ తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా బత్తాయి సాగు జరుగుతుందని, సుమారు 50,000 ఎకరాలలో బత్తాయి సాగు చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భాగంగా నల్గొండ జిల్లాలో 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకే 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని, కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రా లు,తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.