హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అసోచాం ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ‘అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టుల మాదిరిగా ప్రజల సంక్షేమం కోసం మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
రాష్ట్రంలో పట్టణీకరణ జరగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దశ-దిశను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హైకోర్టు భవనంలో పీపీపీ విధానంలో పారింగ్ వసతిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి, స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం కోసం ప్రగతిశీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతోపాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, అందులో భాగంగా పలు రోడ్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తున్నామని చెప్పారు.
పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఎస్టీపీలు నిర్మించి, మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నమని చెప్పారు. హైదరాబాద్‌లో పట్టణ విస్తరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటిలైట్ టౌన్ షీప్ల ఏర్పాటు, మెట్రో విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), హైకోర్టు భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ కాంప్లెక్స్, ఉస్మానియా నూతన భవన నిర్మాణం పనులను వేగవంతం చేస్తున్నట్టు మంత్రి వివరించారు. కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ (చీఫ్ పొలిటికల్ అండ్ ఎకనమిక్ సెక్షన్), ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేశ్ చుకపల్లి, అలార్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పూనమ్ కశ్యప్, అసోచాం రాష్ట్ర ప్రతినిధి దినేశ్ పాల్గొన్నారు.