హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడారని, దీంతో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆనాడు వారు చెప్పబట్టే.. ముందుగా తాము జాగ్రత్తపడుతున్నామని వివరించారు. ఆదివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తిప్పికొట్టేందుకే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి నిరంజన్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. మహాభారతంలో ధర్మరాజు ధర్మ సంస్థాపన కోసం అశ్వత్థామ హతః కుంజరః అని అన్నాడని, తాము కూడా అదే విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. నాడు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని రాజ్యాంగ స్ఫూర్తిని బీఆర్ఎస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. ‘ఇప్పుడు ప్రజాపాలన పేరుతో మీరు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి తడబడ్డారు. పార్టీ ఫిరాయింపులను తాము ప్రోత్సహించడం లేదని, ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
‘ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హకు బీఆర్ఎస్ నాయకులకు లేదని చెప్పారు. నిరంజన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, కబ్జాల గురించి ప్రజలకు తెలుసునని, అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని తెలిపారు.
నిరంజన్‌రెడ్డి చరిత్ర బయటపెడతాం
అతి త్వరలోనే మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అవినీతి చర్రితను బయటపెడతామని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని కార్యకర్తలే తమ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. విభజన సమస్యల పరిషారానికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రు లు సమావేశమయ్యారని పేర్కొన్నారు.