మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:39

అమర జవాన్ల కుటుంబసభ్యులకు

అమర జవాన్ల కుటుంబసభ్యులకు

  • మొదటిసారిగా గ్రూప్‌-1 పోస్టు
  • సైనిక కుటుంబాలకు తెలంగాణ సర్కార్‌ అండ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమరజవాన్ల కుటుంబీకులకు గ్రూప్‌-1 స్థాయి పోస్టును ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త సత్సంప్రదాయాన్ని నెలకొల్పింది. అందులోనూ ఏ పోస్టులో చేరాలనే అంశం వారికే వదిలివేయడం కూడా ఇదే తొలిసారి. గతంలో రాజకీయ నేతలను నక్సలైట్లు చంపినప్పుడు వారి కుటుంబసభ్యులకు నేరుగా డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిని నక్సలైట్లు చంపినప్పుడు ఆయన కోడలు చిట్టెం లక్ష్మికి, మరో ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను నక్సల్స్‌ చంపినప్పుడు అతని కుమారుడికి ఆర్డీవో ఉద్యోగం ఇచ్చారు.

నక్సల్స్‌ చేతుల్లో హత్యకు గురైన సివిల్‌ సర్వీసెస్‌ అధికారి వ్యాస్‌ కుమారుడు శ్రీవాత్సవ, పరదేశీ నాయుడు భార్య రేఖారాణి, ఉమేష్‌చంద్ర భార్య నాగరాణి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెక్యూరిటీ అధికారి వెస్లీ కుటుంబ సభ్యురాలు క్రాంతి వెస్లీ, బీహార్‌లో సర్వీస్‌చేస్తూ నక్సల్స్‌ చేతిలో చనిపోయిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారి కుటుంబం నుంచి డాక్టర్‌ లక్ష్మి, వైఎస్‌ వద్దే అధికారిగా ఉండి ఆనాటి హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో మరణించిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారి సుబ్రమణ్యం కూతురు సింధు సుబ్రమణ్యంకు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు ఇచ్చారు. క్రీడారంగంలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు సైన్యంలో పనిచేసి అమరులైనవారి కుటుంబసభ్యులకు కూడా గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చి యావత్‌ తెలంగాణ సమాజం మీ వెంట ఉన్నదనే నమ్మకాన్ని సీఎం కేసీఆర్‌ కలిగించారు.

సీఎం కేసీఆర్‌కు  రుణపడి ఉంటాం 

సీఎం కేసీఆర్‌ స్వయంగా మా ఇంటికి వచ్చి భరోసానివ్వడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్‌రెడ్డికి రుణపడి ఉంటాం. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌ మా పిల్లలతో కూడా మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. మా ఇష్టానికి అనుగుణంగా సాయం అందించడం మాకిస్తున్న గౌరవానికి నిదర్శనం. గ్రూప్‌-1 ఉద్యోగ పత్రాన్ని ఇస్తూ నాకు అనుకూలమైన విభాగాన్ని ఎంచుకొనేందుకు అవకాశం కల్పించారు. కోరిన విధంగా రూ.4 కోట్లు నాకు, నా పిల్లలకు.. మరో కోటి రూపాయలను మా అత్తగారికి అందజేశారు. ఇంటిస్థలం పత్రాలు కూడా ఇచ్చారు. దేశంలోని ఇతర అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేస్తామనడం సంతోషం కలిగిస్తున్నది. పరిస్థితులు కుదుటపడ్డాక ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారు.

- సంతోషి, కర్నల్‌ సంతోష్‌బాబు భార్య 

సీఎం రాక మాకు ధైర్యాన్నిచ్చింది

సీఎం కేసీఆర్‌ మా ఇంటికి రావడం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా వచ్చి సా యం అందించడాన్ని మరిచిపోలేం. నా కొడుకు లేని లోటు ఎవరూ తీర్చలేకపోయినా తెలంగాణ ప్రభు త్వం ఇస్తున్న భరోసా మాకు భవిష్యత్‌పై విశ్వాసం కలిగిస్తున్నది. 

- బిక్కుమల్ల మంజుల, కర్నల్‌ సంతోష్‌బాబు తల్లి 


logo