BRS Party | హైదరాబాద్ : తెలంగాణలో దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని అద్భుతాలు, విజయాలను ఈ పదేండ్ల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీ పరంగా కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించాలి. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో మన పార్టీ విజయాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. విద్యుత్ రంగంలో గుజరాత్లో ఇవాళ్టికి కోతలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. దేశంలోనే తొలిసారిగా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. నీటి విషయంలో మన రాష్ట్రంలో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ రంగంలో దేశమంతా ఇబ్బంది పడుతుంటే.. తెలంగాణలో మాత్రం వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. ప్రతి ఒక్కరికి చేరువయ్యాం. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో బాదపడటం లేదు. అందరి ఆకలి తీర్చాం. దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులు చేసి చూపించాం. ఈ విషయాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు.