సూర్యాపేట : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షాలు మొదలైన రోజు నుండే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మకాం వేసిన మంత్రి జగదీష్ రెడ్డి మూడు జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మానిటరింగ్ చేస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించడంతో పాటు సోమవారం రాత్రి పొద్దు పోయాక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డితో మాట్లాడి వర్షాలపై ఆరా తీశారు.
ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్నింటికి మించి జోరుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అంటూ రోగాలు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదే సమయంలో రెస్క్యూ బృందాలతో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మూసీకి వరద ఉదృతం ఆయిన నేపథ్యంలో పంట కాలువలకు నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి విడుదల నేపథ్యంలో మూసి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో పాటు నీటిపారుదల, పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాలు, వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.