Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : ఆరేండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు, పర్యావరణ పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్య, వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు. పైగా అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు. అటువంటి శాపం నుండి ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విముక్తి కల్పించారని తెలిపారు.
సోమవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన భూమి పుత్రులకు మంత్రి జగదీశ్ రెడ్డి పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని చౌటుప్పల్, తుర్కపల్లి, నారాయణపురం మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు చెందిన 205 మంది లబ్ధిదారులకు 213 ఎకరాల భూమికి ఆయన పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులు, గోండులు, అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. పోడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతాంగానికి తక్షణమే రైతు బంధు పథకం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. పాలనలో అద్భుతాలు సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని ఆయన కొనియాడారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. తద్వారా తండాలలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. 2001 నాటి పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సాధించిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే తడవుగా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు, త్రాగునీరు, కళ్యాణాలక్ష్మి/షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.