Education Day | సమాజంలో పేరుకు పోయిన అసమానతల పారద్రోలేందుకు బలమైన పునాది విద్యేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఓ తరాన్ని పూర్తిగా విద్యావంతులుగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే ఆ అంతరాలు తొలగిపోతాయని సీఎం కేసీఆర్‌కు ఉన్న గట్టి నమ్మకమని మంత్రి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవం సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యలో వచ్చిన మార్పులకు గురుకులాలు సాధిస్తున్న విజయాలు దిక్సూచి అని, గురుకులాలకున్న డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన రోజున సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధించినట్లవుతుందన్నారు.
మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేలకోట్లు ఖర్చు పెడుతుందన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ఉపాధ్యాయులున్నారు. డ్రాప్ ఔట్స్ తగ్గి ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారన్నారు. విద్యారంగంలో అద్భుతాలు సృష్టించే నైపుణ్యం ప్రభుత్వ ఉపాధ్యాయులకుందని ఆయన తెలిపారు. 2014కు పూర్వం 52శాతానికి పైబడి ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లేవారని, పాఠశాలలపై ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. అభివృద్ధి అంటే ఇష్టపడని వాళ్లే పెదవి విస్తున్నారన్నారు. చెప్పిందే చేయడం.. చేసినదే చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అన్నారు. దశాబ్ది ఉత్సావాలు ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించుకుంటున్నమన్నారు.