Minister Jagadish Reddy | కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట సీతారామ, సుమంగళి ఫంక్షన్ హాల్స్‌లో సూర్యాపేట రూరల్, చివ్వెంల మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇన్ఛార్జీల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రాబోయే ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ సర్కారు అద్భుతాలు చేసిందన్నారు. పార్టీకలతీతంగా చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు బలమన్నారు.
75ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు అతీతంగా, ఎన్నికలతో సంబంధం లేకుండా సంక్షేమమే ఎజెండాగా పరిపాలన అందిస్తున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంచిన రూ.75వేలకోట్ల దీనికి నిదర్శనమన్నారు. గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి పథకాలను సైతం ఎన్నికలతో సంబంధం లేకుండా, అవినీతికి తావులేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న నేత కేసీఆర్ అన్నారు.
ప్రజల మనోభావాలే పార్టీకి శిరోధార్యమన్న మంత్రి.. ప్రభుత్వంగా చేసిన ప్రతి పని బీఆర్ఎస్
పార్టీదేనన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ద్రోహులు అంతా ఏకమవుతున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత బూత్ ఇన్చార్జిలదేనన్నారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ప్రతి పథకాన్ని పార్టీగా చేసుకుని ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు అని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షించారు.