నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన
ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి, పేదలకు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలో 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసి, ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్బండ వర్ణాల సంక్షేమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసే వరకు ప్రతి బిడ్డను సంరక్షిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన సర్వ నాశనం చేశాయని మండిపడ్డారు.
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. నల్లగొండలో ఇంచు భూమి ఖాళీ లేకుండా సస్యశ్యామలం చేసాం. వచ్చే ఎన్నికల్లో 12 స్థానాలను మళ్లీ బీఆర్ఎస్ గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.