హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలపై కాకుండా బూతు మాటలపై నమ్మకం పెట్టుకొని బూతురెడ్డిగా మారారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటమి ఖాయమన్న మానసిక ఒత్తిడితోనే రేవంత్ సీఎం కేసీఆర్‌పై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో రేవంత్‌రెడ్డిలాగా ఇంత దుర్మార్గ, నీచ పదజాలాన్ని ఎవ రూ వాడలేదని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టివిక్రమార్క ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ స్థాయిని కూడా దిగజారుస్తున్న రేవంత్ దుర్మార్గాన్ని కాంగ్రెస్ త్వరలోనే గుర్తిస్తుందని చెప్పారు.
తామెన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని, కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిపోయిన తరువాత అసహనం, భయం, ఆందోళనతో రేవం త్ తిట్లదండకం ఎత్తుకున్నారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. కర్ణాటకలో కనీసం 5 గంట ల కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఏమిచేయాలో తోచక ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుర్భాషలకు దిగారని మండిపడ్డారు. కాంగ్రెస్ అపోహలు సృష్టించినంత మాత్రాన రైతులు సీఎం కేసీఆర్‌ను వదిలివేస్తారనుకోవడం భ్రమేనని చెప్పారు. కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు కూడా రావని గ్రహించే దుర్మార్గ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.50 కోట్లతో పీసీసీ పదవిని కొనుక్కొని, ఆరేడు కోట్లకో సీటు అమ్ముకొనేవాడా రాష్ర్టానికి మేలు చేసేది? అని ప్రశ్నించారు.
కర్ణాటకలో కరెంటు రావడం లేదని నిరూపించడానికి, అవసరమైతే 19 గంటలు కరెంటు తీగలు పట్టుకోవడానికి సిద్ధమని, తెలంగాణలో పట్టుకుంటారా? అని కాంగ్రెస్ నేతలకు జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, లింగయ్య, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.