Jagadish Reddy | సూర్యాపేట, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే దళితబంధు, బీసీబంధుతోపాటు అనేక పథకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చివరకు 24 గంటల విద్యుత్తును, మిషన్ భగీరథ మంచి నీళ్లు సైతం ఆపాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఎలాగైనా ఆపాలనే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, అందుకోసం ఎన్ని ఆకృత్యాలకైనా పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జనం కోరుతుండటంతో ఆ పార్టీకి భయం పట్టుకున్నదని విమర్శించారు.