
హైదరాబాద్ : కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తూ దానికి ఆశీర్వాద యాత్రగా నామకరణం చేయడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం శాసనసభ ప్రాంగణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ లతో కలసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హోదాలో ఆశీర్వాద యాత్ర పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం కిషన్ రెడ్డికే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణా రాష్ట్రంలో చేపట్టిన ఆశీర్వాద యాత్రకు అర్థం లేదన్నారు. ఆశీర్వాద యాత్ర ఎందుకో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మోడీ సర్కారు రైతుల నడ్డి విరిచే చట్టాలు తెస్తున్నందుకు ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలా అని ప్రశ్నించారు. అసలు ఆశీర్వాద యాత్ర ఎందుకో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతుల మీద పెను భారం మోపినందుకా ? యాత్ర అంటూ నిలదీశారు. లేక రేపో మాపో సవరణ పేరుతో విద్యుత్ చట్టాన్ని సవరించి కార్పొరేట్ రంగానికి అప్పగించబోతున్నందుకా ? అని నిలదీశారు. పైగా కేంద్రం ఇస్తున్న నిధులలో దుర్వినియోగం జరుగుతుందంటూ ఆశీర్వాద యాత్రలో కొత్త పల్లవి అందుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ దుర్వినియోగం జరిగింది అన్నది రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధులలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందన్న చిన్న లాజిక్ తెలియని ఆయన కేంద్రమంత్రి ఎలా అయ్యారో అన్నది ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ నుండి తెచ్చి ఇవ్వడం లేదన్న నిజాన్ని ఆయన గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలు కాపీ కొడుతూ తమ డొల్ల తనాన్ని బయట పెట్టుకుంది బీజేపీ నేతలేనంటూ విమర్శించారు. మిషన్ భగీరథపై కేంద్ర జలవనరుల శాఖా మంత్రి స్వయంగా పార్లమెంట్ లో చెప్పిన అంశమే టీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతుందన్నారు. హైదరాబాద్‌లో తాలిబన్లు ఉన్నారంటూ బీజేపీ ప్రకటన చేస్తుందంటే కేంద్రాన్ని పాలించడంలో ముమ్మాటికి మోడీ సర్కారు ఫెయిల్ అయినట్లేనన్నారు. పార్లమెంట్లో ఒక మాట, బయట ఒక మాట, మీడియా ఎదుట మరొమాట మాట్లాడుతున్న బీజేపీకి దేశ ప్రజలు త్వరలోనే షాక్ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.