గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:38:39

ఒట్లు, తిట్లతో ఓట్లు రాలవు

ఒట్లు, తిట్లతో ఓట్లు రాలవు

  • ఒకరిది దరిద్రం.. మరొకరిది నికృష్టపాలన 
  • సీఎంను దేశద్రోహి అన్నవారిపై చట్టపరమైన చర్యలు 
  • వందకుపైగా సీట్లతో జీహెచ్‌ఎంసీపై గులాబీజెండా  
  • మీడియాతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తిట్లు, ఒట్లతో ఓట్లు రాలవని చెప్పారు. బాధ్యతగల స్ధానాల్లోఉన్న వ్యక్తులు కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఇంత నీచంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. వారి భాషను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌, బీజేపీలే చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రజాభిమానం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ బలమని చెప్పారు. 

కొంతమంది నాయకులు వారిహోదా మరచి, స్థాయి మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నీచంగా మాట్లాడుతున్నారని, వారి చేష్టలను ప్రజలే ఈసడించుకుంటున్నారని అన్నారు. బాధ్యతమైన ఎంపీ పదవిలో ఉండి సీఎం కేసీఆర్‌ను దేశద్రోహి అని నిందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి సోమ భరత్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లెన్ని.. 2014 ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌కు వచ్చినవెన్ని? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేసినది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, టీఆర్‌ఎస్‌పై ప్రజలకున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొంటున్నాయని ఆరోపించారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన దరిద్రపు పార్టీ కాంగ్రెస్‌ అయితే.. బీజేపీ నికృష్ట పార్టీ అని మండిపడ్డారు.

వరదసాయం ఇవ్వొచ్చని లేఖ ఇస్తారా?

హైదరాబాద్‌ వరద బాధితులకు సహాయం నిలిపివేయాలని తాము ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇవ్వలేదని, అది తమది కాదని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులకు బాధితులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వరదసాయం చేయొచ్చని మరోలేఖ ఇవ్వాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఏడు మండలాలను, సీలేరు పవర్‌ ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపిన నికృష్టపార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. 2014కు ముందు, తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని.. దమ్ముంటే కాంగ్రెస్‌, బీజేపీలు చర్చ కు రావాలని సవాల్‌ విసిరారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు ప్రజలకు అవసరమని భావించిన సీఎం కేసీఆర్‌ వాటిని ప్రవేశపెట్టారని అన్నారు. హైదరాబాద్‌లో తీవ్రమైన మంచినీటి సమస్యను తీర్చడంతోపాటు, 24 గంటలు కరెంట్‌ను అందిస్తున్న గొప్పదార్శనికుడు కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.