సిటీబ్యూరో, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ ) : మవోయిస్టులకు మద్దతునిచ్చేలా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి సీతక్కను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు యాంటి టెర్రరిజం ఫోరం చైర్మన్ డాక్టర్ రావినూతల శశిధర్ గురువారం తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నాయకుడు సుధాకర్ అలియాస్ శంకరన్న గ్రామానికి మంత్రి వెళ్లి మావోయిస్టులకు నివాళులర్పించారని ఆరోపించారు. మాజీ నక్సలైట్ , పోలీసులకు లొంగిపోయి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్క ప్రస్తుతం మంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ రహస్యాలు మావోయిస్టులకు చేర్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతికి కూడా మంత్రి సీతక్క వ్యవహారశైలిపై లేఖలు రాసినట్టు వివరించారు.