మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యం కోసం నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ప్రదీప్‌గౌడ్ ఏకంగా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలను చింపి కుర్చీలను విరగ్గొట్టారు. మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా వేరే పార్టీలో చేరి ఓడగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా గురువారం ప్రదీప్‌గౌడ్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనుచరులు ప్రదీప్‌గౌడ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆయన వస్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తామని హెచ్చరించడంతో పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి. ఇదంతా ఎమ్మెల్యేనే దగ్గరుండి చేయిస్తున్నాడని ప్రదీప్‌గౌడ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.