సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి తేల్చిచెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. కేంద్ర తప్పుడు విధానాలతో దేశ ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని తెలిపారు.
తెలంగాణాలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని జగదీశ్ రెడ్డి విమర్శించారు. వార్తల్లో ట్రెండింగ్ కావడం కోసం ప్రతిపక్ష నాయకులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఏమీ లేక కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అప్పుల మీద పార్లమెంటులో మాట్లాడకుండా, రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారు.. కానీ కేసీఆర్ నిప్పులాంటి మనిషి.. ఆయనను ముట్టుకోవడం ఎవరి వల్లా కాదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ జోలికి వస్తే బీజేపీ నాయకుల చిట్టా విప్పుతామని హెచ్చరించారు.
విలీన గ్రామాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఏడు మండలాలను బీజేపీ కుట్రతో ఆంధ్రాలో విలీనం చేసిందన్నారు. అక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. భౌగోళికంగా ఉన్న ప్రజల అభ్యంతరాలపై ఆలోచించాలని మంత్రి సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాచలంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సీఎం రమేశ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ఎక్కడుందో.. భద్రాచలం ఎక్కడుందో తెలియకుండా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడని తెలిపారు. వరద నీటితో ప్రాజెక్ట్ పైభాగం లేక కింది భాగం మునుగుతుందో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఒక బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తమిళిసై గవర్నర్‌లా ఉండకుండా.. రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై గవర్నర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్‌భవన్ కేంద్రంగా మారుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.