సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించామన్న కిషన్ రెడ్డి, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కిషన్ రెడ్డి , బండి సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారిని చూసి నవ్వుకుంటున్నారు అని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోదీ యత్నిస్తున్నారని తెలిపారు. మోదీ రైతు విధానాలు నచ్చకనే నెలల పాటు రైతులు రోడ్డెక్కితే.. మాది రైతు ప్రభుత్వం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనడం సిగ్గుచేటన్నారు. మోదీ గో బ్యాక్ అని ఢిల్లీలో రైతులు నినదించారు. కానీ ఆయా రాష్ట్రాల రైతులు మాత్రం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు తమను తెలంగాణలో కలపండి అని వేడుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్ అభివృద్ధి ఫలాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.