హనుమకొండ : విద్యుత్ ప్రైవేటీకరణ విషయంలో విద్యుత్తు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ -1104 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికుల పోరాటానికి తెలంగాణ విద్యుత్ కార్మికులే నాయకత్వం వహించాలన్నారు. కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న రాష్ట్రంపై కక్ష పెంచుకుని కుట్రలకు పాల్పడుతోందని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.12 వేల కోట్లు నిలిపివేయడంతో పాటు, బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫోన్లు చేసి అప్పు ఇవ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కీలక రంగాలైన విద్యుత్, వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై రైతులు పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ప్రధాని మోదీ కుడి, ఎడమ భుజాలైన కార్పొరేట్ సంస్థలను ధనవంతులను చేయడానికి విద్యుత్ ప్రైవేటీకరణను వదలి పెట్టడం లేదన్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణపై కార్మిక లోకం పోరాటం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్ష పాతి అన్న మంత్రి విద్యుత్ కార్మికుల్లో వెలుగులు నింపిన మహానుభావుడన్నారు. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ త్వరలో పరిష్కారం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని, ఉద్యోగుల సమస్యలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి తెలుసన్నారు. వాటిని క్రమంగా పరిష్కరించుకుందామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.