నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రోడ్లు అందుబాటులోకి తేలేకపోయారన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎంపీ లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భగవత్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు రామచంద్ర నాయక్, తిప్పన విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మంచినీళ్ల సౌకర్యం లేదని, విద్యుత్ కూడా ఆరుగురు మాత్రమే అందుతుందన్నారు. దేశంలో తెలంగాణలోనే 24 గంటల విద్యుత్ అందుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎవరు వచ్చినా సీఎం కేసీఆర్‌ను ఏం చేయలేరని, 60 సంవత్సరాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీ ఏం అభివృద్ధి చేశారో బేరీజు వేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ తర్వాత తెలంగాణ ఆకలితో ఉన్నవారు ఎవరూ లేరని అన్ని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయన్నారు.
దేశాన్ని అధోగతి పాలు చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని, 2014లో మోదీ దేశంలో తిరిగి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పారని.. ఇంకా ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. రూ.2వేలనోట్లతో బీజేపీ నల్లధనం దాచుకుందని, ప్రభుత్వ ఆస్తులను అమ్మతున్న మోదీ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడన్నారు. గుజరాత్లో ఇప్పుడు పవర్ హాలీడులున్నాయని, బీఆర్ఎస్ను చూసిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వణుకుపడుతుందన్నారు. ఏపీలో కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని, ఈ దేశ రైతాంగాన్ని కాపాడాలనే తపని కేసీఆర్‌కు ఉందని, అందుకు బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు.