Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు సంబంధిత అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయన్నారు. మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామని, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు సేవలు అందించాలని చెప్పారు.
ఈ నెలాఖరు వరకు 3,206 పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిలో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన 321 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేయాలని, పల్లె దవాఖాన టైమింగ్ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డాక్టర్ ఫొనో నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా బోర్డుపై ఏర్పాటు చేయాలన్నారు. అందిస్తున్న సేవలు, చేస్తున్న పరీక్షలు, వెల్ నెస్ యాక్టివిటీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. జిల్లా వైద్యాధికారులు పనితీరు పై సమీక్షలు చేయాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం విజవంతంగా కొనసాగుతున్నదని,
67 పని దినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం సంతోషకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. 3006 వార్డుల్లో (87 శాతం), 9556 పంచాయతీల్లో (74.72 శాతం) పూర్తి చేసినట్లు చెప్పారు. 27 శాతం మందికి అద్దాలు అవసరం కాగా, సగటున ఒక్కో బృందం రోజుకు 120 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. 19.64 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 15.30 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరం అని గుర్తించడం జరిగింది. ఇందులో 12 లక్షల మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర సగటు (95 శాతం) కంటే తక్కువగా అద్దాలు పంపిణీ చేసిన జిల్లాల్లో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలి అన్నారు. హైదరాబాదులో పంపిణీ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని హరీశ్‌రావు ఆదేశించారు.
ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఈ రాజేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.