Harish Rao | సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్‌రావు ఒక అరుగు మీద కూర్చున్న ఓ వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఒక సామాన్యుడి మాదిరిగా అవ్వ పక్కనే అరుగు మీద కూర్చుని మంత్రి హరీశ్‌రావు సాగించిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ సంభాషణ యథాతథంగా..
హరీశ్‌రావు : ఏ పేరు ఏంది..?
నర్సవ్వ: నా పేరు ఏంపల్లి నర్సవ్వ
హరీశ్‌రావు : తిన్నవా..?
నర్సవ్వ: తిన్న అయ్యా..
హరీశ్‌రావు : ఏం విషయాలు..
నర్సవ్వ: జ్వరం వచ్చింది.. కండ్లకు ఆపరేషన్ చేపించుకున్న.
హరీశ్‌రావు : ఎప్పుడు చేపించుకున్నవు?
నర్సవ్వ: క్రిస్మస్ పండుగ తెల్లారి..
హరీశ్‌రావు : క్రిస్మస్ తెల్లారా.. పింఛన్ వస్తున్నదా..?
నర్సవ్వ: వస్తుంది బాంచన్.. రెండు వేలు..
హరీశ్‌రావు : ఎవరు ఇచ్చిండ్రు..?
నర్సవ్వ:: కేసీఆర్ సార్..
హరీశ్‌రావు : బియ్యం వస్తున్నాయా..?
నర్సవ్వ: వస్తున్నాయి సార్..
హరీశ్‌రావు : డాక్టరమ్మ ఉన్నదా మీ ఊర్ల.. ఆశ వర్కర్, ఏఎన్ఎం.. గోళీలు ఇస్తదా.. తిరుగుతదా.. బీపీ, షుగర్ గోళీలు ఇస్తదా..?
నర్సవ్వ: ఇస్తరు సార్.. అక్కడికి వెళ్లగానే ఇస్తది.
హరీశ్‌రావు : మంచినీళ్లు వస్తున్నాయా? నీళ్ల తిప్పలు పోయినయా?
నర్సవ్వ: పోయినయి.. మంచినీళ్లు పొయికాడికే వత్తున్నాయి.
హరీశ్‌రావు : పొయికాడికే వత్తున్నాయా..? ఇదివరకు ఏడికి వత్తుండే.. బాయికాడికి వత్తుండేనా..?
నర్సవ్వ:బోరింగ్ కొడుతుంటిమి. నీళ్లు మోసి మోసి బుజం బొక్క విరిగిపోయింది. ఇప్పుడు కోడండ్లు అదృష్టవంతులు.
హరీశ్‌రావు : నువైతే మోసినవు..?
నర్సవ్వ: ఎనకటి కాలంలో అంతా మోసిండ్రు. ఇప్పుడు నీళ్లు మంచిగ వత్తున్నయి. ఇప్పుడు వాళ్లే మంచోళ్లు.
హరీశ్‌రావు : ఇంక ఏం సంగతులు. దవాఖానకు యాడికి పోతవు. గజ్వేల్‌కు పోతావా.. ?యాడికి పోతవు?
నర్సవ్వ: సర్కార్ దవాఖానకు పోతా.
హరీశ్‌రావు : (చిరునవ్వుతో )పాన్ తింటవా.. ? ఏం తింటవు..? దాచుకోవడితివి..? హు.. మరి చేతులు అడ్డం పెడితివి? (అనగానే నర్సవ్వ చిరునవ్వు నవ్వింది) తింటే తింటివి ఏం ఉన్నది అండ్ల?
నర్సవ్వ: రోగం మించుక వస్తే గజ్వేల్ దవఖానకు పోతాం. దగ్గు, దమ్ము ఎన్నో ఉన్నాయి బాంచన్..
హరీశ్‌రావు : అక్కడ బొమ్మ ఏంది.. ఏమో బొమ్మ పెటిండ్రు.?
నర్సవ్వ: గాంధీ బొమ్మ..
హరీశ్‌రావు : గాంధీ మహాత్ముడు ఏం చేసిండు..?
నర్సవ్వ: ఏం చేసిండు అంటే గవన్నీ నాకు తెలియవు బాంచన్.
హరీశ్‌రావు : చిరునవ్వు నవ్వుతూ మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిండు కదా. మనం తెల్లదొరల కింద ఉంటిమి. ఇంగ్ల్లిషోల్ల దగ్గర నుంచి మన దేశాన్ని విడిపించి మనకు స్వాతంత్య్రం తెచ్చిండు. (విగ్రహం వైపు చూపుతూ) అందుకోసం ఆ విగ్రహం పెట్టినం ఇయ్యాలా. ఇగ అంతా మంచిదేనా అయితే.. వస్తా అమ్మా.. అంటూ గజ్వేల్ పర్యటనకు బయలుదేరారు.
ఇందుప్రియాల్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు రోడ్డు పక్కనే బీర్నీస్ తోటలో పనిచేస్తున్న రైతులను చూసి కారు ఆపించారు. రైతుల వద్దకు వెళ్లి.. ‘ఏమమ్మా బాగున్నారా..? అంతా బీర్నీస్ పంట పెట్టినవ్?’ అంటూ రైతు చాకలి ఎల్లవ్వను పలకరించారు. ‘బీర్నీస్ పంటకు ఇప్పుడు మంచి గిరాకీ ఉన్నది సారు..’ అంటూ ఆమె జవాబిచ్చింది. ‘మరి గిట్టుబాటు అయితుందా? ఎంతమంది పనివాళ్లను పెట్టుకుట్టున్నావ్?’ అని మంత్రి అరా తీయగా.. ‘లేదు సారు మా అత్త, కోడలు, బిడ్డ అందరం కలిసి పంటను పండిస్తున్నాం సారు.. ఇంతకు ముందు కరెంట్ బాధ, నీళ్ల బాధ ఉండేది. ఇప్పుడు అ బాధ తప్పింది. ఫుల్ కరెంట్‌తో బోరు మోటరు పెట్టి నీళ్లు వాడుకుంటున్నాం సారు’ అంటూ బదులిచ్చింది. ‘కేసీఆర్ సారు పుణ్యమాని కరెంట్ ఫుల్, కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి సారు’ అంటూ సంతోషం వ్యక్తంచేసింది. బీర్నీస్ మంచిగా పండిది సారు, బీర్నీస్ కూర వండుకొమ్మని మంత్రి హరీశ్‌రావుకు కూరగాయలు ఇచ్చింది. వాటిని తీసుకున్న హరీశ్‌రావు తిరిగి డబ్బులు చెల్లించడం విశేషం. ఈ పర్యటనలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Harish Rao anna interaction with grand ma🤗 pic.twitter.com/RPMim12F6M
— 🇮🇳KCR FOR INDIA 🇮🇳 (@KCRforINDIA_) March 3, 2023