హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన చర్చతో ఆ విషయం మరోసారి బహిర్గతమైనదని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యాలపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై జాఫర్ హుస్సేన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రఘునందన్‌రావు మాట్లాడిన తర్వాత మంత్రి హరీశ్‌రావు జవాబిచ్చారు.
16 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం
ఎనిమిదేండ్లలో ఐటీ రంగంలో 15% వృద్ధి సాధించామని, ఉత్పత్తిని మూడున్నర రెట్లు పెంచగలిగామని తెలిపారు. ఈ దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లో దకేలా చేయడం సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన కృషికి నిదర్శనమన్నారు. పారిశ్రామిక కారిడార్‌లో మొండిచెయ్యి చూపించినా.. రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల 20 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. బల్క్ డ్రగ్ పార్కు అడిగితే ఇవ్వలేదని, అయినా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకొంటున్నామని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం ఒక రూపాయి ఇవ్వకపోయినా, వేల చెరువులు బాగు చేసుకొన్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
లోయర్ సీలేరును కోల్పోవడంతో ఏటా రూ.1000 నష్టం
రాష్ట్రం ఏర్పడ్డా.. ప్రభుత్వం ఏర్పడకముందే ప్రజల గొంతుకోసేలా లోయర్‌సీలేరు.. 7 మండలాలను గుంజుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏడాదికి 300 రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తిచేసే అత్యుత్తమ ప్రాజెక్ట్ లోయర్ సీలేరు అని, అక్కడ 10 -20 పైసలకే యూనిట్ కరెంటు ఉత్పత్తి అయితదని, ఇది కాస్తా ఏపీకి పోవడంతో తెలంగాణ ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నష్టం జరుగుతున్నదన్నారు. కర్ణాటక లోని అప్పర్‌భద్ర, ఉత్తరాఖండ్‌లోని కెన్ బెత్వ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వడానికి ఏం అడ్డమొచ్చిందని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కాంగ్రెసోల్లు తప్పేచేసిన్రు.. మరీ బీజేపోల్లు ఎందుకిస్తలేరని నిలదీశారు. జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.లక్ష కోట్లు, రూ.50 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వాస్తవంగా జాతీయ రహదారులపై తెలంగాణలో కేంద్రం ఖర్చు చేసింది రూ.21,676 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ డబ్బులు కూడా తెలంగాణ రోడ్లను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో రోడ్లు వేసి, టోల్ గేట్ల ద్వారా ప్రజల ముకుపిండి వసూలు చేస్తారని వెల్లడించారు.
రైల్వే లైన్లకోసం కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు రూ.1,010 కోట్లు ఇచ్చిందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ చెప్తున్నారని, రైల్వే ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్రం రూ.1,900 కోట్లకు పైగా ఖర్చు చేసిందని గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి చేయలేకపోయిందని, తాము అధికారంలోకి వస్తే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని, కానీ, ప్రాజెక్టుకు ఒక పైసా ఇవ్వలేదన్నారు. ప్రశ్నించే రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారని, కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లనుంచి పుట్టింది. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని, అదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని చెప్పారు. ‘డేర్ టు డ్రీమ్’ అనేది మా ప్రభుత్వ నినాదం’ అని హరీశ్ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగినప్పటికీ ఎనిమిదేండ్లయినా తేల్చలేని దికుమాలిన భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తెలంగాణకు ఇచ్చింది.. సున్నా..
‘గిరిజన యూనివర్సిటీ జాడలేదు.. బయ్యారం ఉకుపరిశ్రమ రాదు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడ్రస్ లేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా సంగతి దేవుడెరుగు.. దేశంలో కొత్తగా 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, రెండు ఐఐఎస్ఈఆర్లు, 16 ట్రిపుల్ ఐటీలు, 4 ఎన్ఐడీలు, 157 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇస్తే.. వీటిలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది సున్నా. దేశవ్యాప్తంగా 80 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. చట్ట ప్రకారం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. 33 జిల్లాలు చేసుకొన్నాం. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. వీటన్నింటి మంజూరు కోసం ఈ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలు చేస్తున్న కృషి.. పెద్ద గుండు సున్నా. వీళ్లు చేయరు.. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకొంటరు’ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
శాసనసభ తీర్మానాలు చేసి పంపినా..
తెలంగాణలో స్పెండింగ్ ప్రభుత్వం ఉంటే.. కేంద్రంలో పెండింగ్ ప్రభుత్వం ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్లు, మైనార్టీల రిజర్వేషన్లు.. ఇలా అనేక అంశాలపై శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తే.. పెండింగ్‌లో పెట్టారు తప్ప ఒకటి కూడా పరిషరించలేదని గుర్తుచేశారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, వివక్షను చూపినా తెలంగాణ సంక్షేమంలో దూసుకెళుతున్నదని చెప్పారు. మిషన్ భగీరథను హర్ ఘర్ జల్, రైతు బంధును పీఎం కిసాన్ యోజన, మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో కేంద్రం కాపీ కొట్టిందని, దీన్ని తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.