గవర్నర్ వ్యవస్థను దిగజార్చిందే బీజేపీఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా?
మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను ఎలా కూలదోశారు?
గుజరాత్ గవర్నర్‌ను ప్రధాని మోదీ ఎందుకు డిస్మిస్ చేశారు?
యావత్ భారతదేశానికి దారి చూపే కాగడా టీఆర్ఎస్సే
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ వెలగని దీపమే
రాజ్యాంగం ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టీకరణ
సభలో విపక్షాలకే ఎక్కువసేపు మాట్లాడే అవకాశమిస్తున్నాం
శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాజ్‌భవన్‌కు కాషాయ రంగు వేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. గవర్నర్‌ను, ఆ వ్యవస్థను బీజేపీ అవమానిస్తున్నదని మండిపడ్డారు. గవర్నర్‌కు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తున్నదే బీజేపీ అని ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌కు, రాజ్‌భవన్‌కు ఏదైనా అంశంపై స్పష్టత కావాలంటే సచివాలయమో, ప్రగతిభవన్ వర్గాలో, అసెంబ్లీ కార్యాలయమో ఇస్తాయని, దీనికీ, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.
రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం
గవర్నర్ వ్యవస్థకు పార్టీ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యాంగం, గవర్నర్ వ్యవస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కనీస అవగాహన లేదన్న విషయం తేలిపోయిందని ఎద్దేవా చేశారు. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవన్న విషయం కూడా బీజేపీ నేతలకు తెలియదన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. శాసనసభ సమావేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే విషయంలో సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో ఉంటారని చెప్పారు. బీజేపీ నేతలకు ఏం మాట్లాడాలో తెలియక గవర్నర్ ఒక మహిళ కనుకనే ప్రభుత్వం అవమానించిందని మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
గుజరాత్ గవర్నర్‌ను డిస్మస్ చేసింది మోదీ కాదా?
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ దేశంలోని మాతృమూర్తులందరినీ అవమానిస్తే, ఆయనను సమర్థించిన బండి సంజయ్‌కు మహిళాలోకం గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? అని హరీశ్‌రావు నిలదీశారు. నరేంద్రమోదీ 2014లో ప్రధాని కాగానే అప్పటి గుజరాత్ గవర్నర్ కమలాబేణీని అకారణంగా డిస్మిస్ చేశారని విమర్శించారు. ‘కమలాబేణి గొప్ప పోరాట యోధురాలు, దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహిళ. ఆమెను అత్యంత అవమానకరంగా డిస్మిస్ చేసింది నరేంద్రమోదీ కాదా? బీజేపీ నేతలకు కమలాబేణి ఒక మహిళ అని గుర్తుకు రాలేదా? పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఒక మహిళ అనే బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదా?’ అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి వెచ్చించిన నిధుల్లో 80 శాతం ప్రధాని మోదీ ప్రచారానికే సరిపోయాయని, అసలు కార్యక్రమానికి వెచ్చించింది 20శాతం నిధులేనని పార్లమెంటు కమిటీ నివేదికే (ది పార్లమెంటు కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్) బయటపెట్టిందని హరీశ్‌రావు సంబంధిత డాక్యుమెంట్లు ప్రదర్శిస్తూ చెప్పారు. దీనినిబట్టే బీజేపీ ప్రభుత్వానికి ఆడపిల్లలపై ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు.
గత సమావేశాల కొనసాగింపే
ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కొత్త సెషన్ కాదని, గత సెషన్‌కు కొనసాగింపు అని హరీశ్‌రావు తేల్చి చెప్పారు. బీజేపీది బుల్డోజ్ చేసే భాష అని తమది పనిచేసే భాష అని అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకొని మాట్లాడాలని, లేకపోతే రాజ్యాంగ కోవిదులను అడిగి తెలుసుకోవాలని బండి సంజయ్‌కు సూచించారు. దేశంలో గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే బీజేపీ అని ధ్వజమెత్తారు. ‘మహారాష్ట్రలో మెజారిటీ లేకున్నా గవర్నర్‌ను వాడుకొని రాత్రికి రాత్రి బీజేపీ అభ్యర్థిని సీఎంను చేయలేదా? మధ్యప్రదేశ్ ప్రజలు అధికారం ఇవ్వకున్నా అధికారంలోకి ఎలా వచ్చారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసిందెవరు?’ అని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ నేతలు రహస్య సమావేశాలు పెట్టుకోవటంపై ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి మొట్టికాయలు వేసిందనే వార్తలు వస్తున్నాయని, ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలని సంజయ్‌కు సూచించారు.
వెలగని దీపం.. బీజేపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆరిపోయే దీపం అన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలను హరీశ్‌రావు తిప్పికొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి దారిచూపే కాగడా అని, బీజేపీ రాష్ట్రంలో ఎన్నటికీ వెలగని దీపమని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు శాంతి, సామరస్యాలను కోరుకుంటారని, బీజేపీ మతం చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తే ఎన్నటికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
తెలంగాణలోనే పద్ధతిగా అసెంబ్లీ
విపక్షాలకే ఎక్కువ టైం ఇస్తున్నాం.. ప్రొరోగ్ కానందున గవర్నర్‌ను పిలువరాదు పార్లమెంటు విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇదే: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రొరోగ్ కాని అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగంపై, శాసనసభ సమావేశాలపై రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, హుందాగా సమావేశాలు జరుగుతున్నది తెలంగాణలో మాత్రమేనని స్పష్టంచేశారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి టీఆఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాలో మాట్లాడారు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో అధికార సభ్యుల కన్నా విపక్ష సభ్యులకే అధిక సమయం కేటాయించామని, జరగబోయే సమావేశాల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
సాంకేతిక కారణాలతోనే ఈ సమావేశాలకు గవర్నర్ ఉండటం లేదని, కొనసాగుతున్న సమావేశాలకు గవర్నర్ ప్రసంగం అనివార్యం కాదని రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉన్నదని వివరించారు. గతంలో అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు ఇలా జరిగిన సందర్భాలను ఆయన వివరించారు. 2004లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం రాష్ట్రపతి ప్రసంగం లేకుండా జరిగిందని, దీనిని సవాలుచేస్తూ ఎంపీ రాంనాథ్ అథవాలే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ప్రొరోగ్ కాని సమావేశాలకు రాష్ట్రపతి ప్రసంగం అవసరం లేదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఉదహరించారు.
రాజ్యాంగంపై బీజేపీ నేతలా మాట్లాడేది?
రాజ్యాంగం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హ్యాస్పాదంగా ఉన్నదని, రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘించిందే బీజేపీ అని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను కూలదోయటం, దొడ్దిదారిన రాష్ర్టాల హక్కులను కాలరాయటమే బీజేపీ చరిత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గోవా, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పులను కాలరాసి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాని మోదీకి రాజ్యాంగం అంటే లెక్కేలేదని విమర్శించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లును అదే పార్లమెంటులో నిలబడి తప్పుపట్టిన చరిత్ర మోదీది అని మండిపడ్డారు.
ఫటాఫట్..
2014లో ప్రధాని మోదీ అకారణంగా డిస్మిస్ చేసిన గుజరాత్ గవర్నర్ కమలాబేణి మహిళ అని గుర్తురాలేదా?
గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని మీరు అష్టకష్టాలపాలు చేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమత మహిళ కాదా?
బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం నిధుల్లో 80 శాతం మోదీ ప్రచారానికే వాడుకొన్నట్టు పార్లమెంటరీ కమిటీయే తేల్చింది కదా?
మాతృమూర్తులను అవమానించిన అస్సాం సీఎం సీఎంకు వంతపాడిన బండి సంజయ్‌కి మహిళల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?
భారతీయ జనతా పార్టీదీ బుల్డోజ్ చేసే భాష.. మాది పని భాష.
రాజ్‌భవన్ వ్యవహారాలతో బీజేపీకి ఏం సంబంధం?
మహారాష్ట్రలో మెజారిటీ లేకున్నా రాత్రికి రాత్రి దొంగచాటుగా బీజేపీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయం గుర్తులేదా?
– మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ప్రశ్నలు