Minister Harish Rao | (నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్) పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి మళ్లీ పదేండ్లు వెనక్కిపోతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరెంటు ఉండదు, రైతుబంధు రాదు, పల్లెల్లో కరువు తాండవిస్తుంది అని చెప్పారు. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. శనివారం బీఆర్ఎస్ అభ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బానోత్ శంకర్‌నాయక్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తరఫున పాలకుర్తి, మహబూబాబాద్, జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, బచ్చన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం, భువనగిరి, వరంగల్ జిల్లా నెక్కొండ రోడ్‌షోల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ను చూసి జాలిపడి, కరిగిపోయి ఆ పార్టీకి ఓటేయొద్దు. రిస్క్ వద్దే వద్దు. కారుకే ఓటు గుద్దు’ అని ప్రజలకు హితవు చెప్పారు. నాటి, నేటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని, కండ్ల ముందున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ర్టాల వాళ్లకు ఉపాధి కల్పించే స్థాయికి చేరామని గుర్తుచేశారు.
చెల్లని రూపాయి వంటి ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ విమర్శించారు. తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఆమె 403 సీట్లలో ప్రచారం చేస్తే 3 సీట్లే కాంగ్రెస్ గెలిచిందని ఎద్దేవా చేశారు అక్కడ ప్రజలు పనికిరావని ప్రియాంకను ఛీదరించుకుంటే, ఇక్కడకు వచ్చి తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు.
రైతులు బిచ్చగాళ్లు అన్న రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలి
కాంగ్రెస్, బీజేపీ ఝూటా మాటలు నమ్మవద్దని, ఆ పార్టీలకు ఢిల్లీ హైకమాండ్ అయితే కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌లో ఓడినోడు నేనే సీఎం అంటడు. గెలిచినోడు నేనే సీఎం అంటడు. ఇలాంటి కాంగ్రెస్ చేతికి రాష్ర్టాన్ని అప్పగించి రిస్క్ తీసుకుందామా?’ అని ప్రజలను అడిగారు.
ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాల్నా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా? కేసీఆర్‌ను శాసించేది, బీఆర్ఎస్ పార్టీని నడిపేది తెలంగాణ ప్రజలే
– మంత్రి హరీశ్‌రావు
కర్ణాటకలో కాంగ్రెస్‌ను నమ్మి గెలిపిస్తే ఇప్పడు అక్కడి ప్రజలు ఆగమైతండ్రని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పుడు సమస్య వచ్చి ఎవరిని అడగాలో తెలియక పరేషాన్ అవుతున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బండారాన్ని అక్కడి రైతులే స్వయంగా తెలంగాణకు వచ్చి బయట పెడుతున్నారని తెలిపారు. కర్ణాటకలో మోసం చేసి అధికారంలోకి వచ్చినట్టే తెలంగాణలోనూ బూటకపు మాటలు చెప్తున్న కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఆగం అవుతామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ఏ విషయం మీదా పూర్తి అవగాహన ఉండదని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి కాంగ్రెస్.. సోషల్ మీడియాలో బోగస్ ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు అడ్డదార్లు తొక్కుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అని చెప్పి ఉన్న గోసి ఊడపీకిర్రు. వాళ్లను నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాల్నా?
– మంత్రి హరీశ్‌రావు
గతంలో తండాలను గ్రామపంచాయతీలు చేస్తమని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిపై ఎల్‌హెచ్‌పీఎస్ వాళ్లు ఏండ్ల తరబడి కొట్లాడితే పట్టించుకోలేదని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వారి డిమాండ్‌ను అమలుచేసి లంబాడీల కలను నెరవేర్చారని వెల్లడించారు. బీఆర్ఎస్కు ఓటేసి మూడోసారి కేసీఆర్‌ను సీఎంను చేస్తే ఈసారి గిరిజన బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘మానుకోట మట్టికి దండం. మానుకోట రాళ్లకు దండం. మానుకోట యువతకు దండం. మానుకోట దెబ్బతో సమైక్యవాదులు వెనక్కి పరిగెత్తారు. మళ్లీ సమైక్యవాదులు ఒకటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తుండ్రు. వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలి’ అని మహబూబాబాద్‌లో అన్నారు. లంబాడీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది కేసీఆరేనని, ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంట్ చాలంటున్నరు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్ ఉచిత సలహాలు ఇస్తున్నరు. ఆయన తుపాకీ రాముడు, పాగల్
– మంత్రి హరీశ్‌రావు
‘చావునోట్ల తలపెట్టి..కేంద్రం మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డికి ఎక్కడైనా పోలిక ఉన్నదా? ఇద్దరి మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది’ అని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి ధ్యాస తప్ప మరోటి లేని కేసీఆర్ మాటంటే ప్రజలకు నమ్మకం, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై విశ్వాసం, వచ్చే ఐదేండ్లలో అమలు చేయబోయే ఎన్నికల మ్యానిఫెస్టో పథకాలపై భరోసా ఉన్నదని చెప్పారు.
చిన్న పిల్లలాంటి తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితం
‘బీఆర్ఎస్ సభలకు జనమే జనం.. కాంగ్రెస్, బీజేపీ సభలు వెలవెలపోతున్నాయి. ఖాళీ కుర్చీలు పెట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటు. కానీ, బీఆర్ఎస్ మీటింగుల్లో చోటు దొరకని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి ఇసుక వేస్తే రాలనంత జనం తరలివస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల జాతీయ నాయకుల సభలకు జనం లేక ఖాళీ కుర్చీలకు తమ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి మొగోళ్లు వచ్చి గుత్తకు మాట్లాడి వరి నాట్లు వేస్తున్నరు. భవిష్యత్తు గురించి రాసిన బ్రహ్మం గారు కూడా మొగోళ్లు నాట్లేస్తరని ఊహించలేదు. కాలాన్ని మన కేసీఆర్ ఎంతగా తిరగ రాసిండో ప్రజలు గమనించాలి.
– మంత్రి హరీశ్‌రావు
అన్ని సర్వే ఫలితాలు బీఆర్ఎస్వైపు ఉన్నాయని, 80 సీట్లతో మరోసారి అధికారంలోకి రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యాక మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా, మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని తెలిపారు. వాళ్ల ఫోన్లకు టింగ్ టింగ్‌మని మెసేజ్‌లు వస్తాయని అన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చిన బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడోసారి అధికారం చేపట్టాక కేసీఆర్ భరోసా పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ మంచి పాడిబర్రె లెక్క ఉన్నారని, తెలంగాణలో అందరం బాగుపడుతున్నామని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అంటే మోసం.. బీఆర్ఎస్ అంటే నమ్మకం
కార్యక్రమాల్లో మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర ఆధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బొడెకుంటి వెంటకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పాగాల సంపత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ జాటోత్ రమేశ్ నాయక్, జడ్పీటీసీ లావుడ్య సరోజహరికిషన్, సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, సంగని సూరయ్య, కొమ్ము రమేశ్‌యాదవ్, పీపీ షేక్ అబ్దుల్నభి, తాటిపెల్లి శివకుమార్, చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, మాదాసురవి, సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.