హైదరాబాద్: ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
హెల్త్‌హబ్ అయిన హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారని, ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం వచ్చేలా నేచర్ క్యూర్ దవాఖాన ఎదుగాలన్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ దవాఖానలో (Nature cure hospital) రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ.10 కోట్లతో ఈ దవాఖానను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇంకా మరిన్ని నిధులు ఇస్తామన్నారు. కొత్తగా అభివృద్ది చేసుకున్న ఈ హాస్పిటల్‌ను ప్రారంభించుకోడం సంతోషంగా ఉందని చెప్పారు.
‘ప్రకృతితో వైద్యం, పంచ భూతాలతో వైద్యం.. అదే ప్రకృతి వైద్యం. అదే నేచురోపతి. ఇది పూర్తి భారతీయ వైద్య సిద్ధాంతం. ఆయుర్వేదం, నేచురోపతి, యోగా, హోమియోపతి, యునాని, సిద్ధ అని ఉంటాయి. ఇక్కడ నేచురోపతి, యోగా విధానాలు అందిస్తున్నారు. నేచురోపతి అనేది పూర్తిగా డ్రగ్ లెస్ హీలింగ్ సిస్టం. ఔషధ రూపంలో ఆహారాన్ని, యోగా, ప్రాణాయామంను శరీరానికి అందించడం ప్రత్యేకం. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడం నేచర్ క్యూర్ విధానం. ఆయుష్ వైద్యంలో నేచురోపతికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్తి నేచురల్ పద్ధతిలో దీర్ఘకాలిక రోగాలకు సైతం చికిత్స అందిస్తారు. డయాబెటిస్, బీపీ, ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, పీసీఓడీ, నడుం నొప్పులు, పెరాలసిస్, సయాటిక, అధిక బరువు, థైరాయిడ్, డిస్క్ సమస్యలు, సోరియాసిస్ ఇలా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చికిత్స ఉంటుంది. సౌర చికిత్స, ఫిజియోథెరపీ, జల చికిత్స, మర్దన చికిత్స, మట్టి చికిత్స ఇలాంటివి చాలా ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి, లైఫ్ స్టయిల్ డిసీజెస్, ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతవుతున్న వారికి నేచర్ క్యూర్ దవాఖాన స్వాగతం పలుకుతున్నది. ఒక విహార ప్రాంతానికి వచ్చినట్లు ఇక్కడికి వచ్చి మంచి ప్రకృతి చికిత్స పొందవచ్చు. ఏ నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా తక్షణ ఉపశమనం కోసం వైద్యుల సలహా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడుతుంటారు. అయితే దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ నేచర్ క్యూర్ చికిత్సలో అలాంటి మాట వినిపించదు. ఇన్ పేషెంట్‌గా ఉన్నవారికి సైతం మంచి భోజనం అందిస్తారు. వారి రోగాలకు సంబంధించిన చికిత్సలో భాగంగా ప్రత్యేక ఆహారం అందిస్తారు. పూర్తి హైజీన్తో, నూనెలు, మసాలాలు, ఉప్పు, కారాలు లేకుండా ఉంటుంది. జ్యూస్, సలాడ్ వంటివి సమయానికి అందిస్తారు. బరువు తగ్గాలనుకున్న వారికి, ఇతర రోగాలున్న వారికి పత్యేకంగా లిక్విడ్ డైట్ సైతం అందిస్తారు.
1949 స్థాపించిన ఈ ప్రకృతి చికిత్సాలయం, ప్రకృతి వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో చదువుకున్న వారు దేశంలోని ప్రసిద్ధ ప్రకృతి చికిత్సాలయాల్లో పని చేస్తుండటం మనకు గర్వకారణం. అయితే ఘన చరిత్ర గల ఈ దవాఖానను ఉమ్మడి పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా నిర్వీర్యం చేశారు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రభాగాన ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ప్రకృతి వైద్యం కోసం ఎంతో మంది ప్రైవేటుకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అలాంటి వారికి అతి తక్కువ ఖర్చుకే ఉత్తమ వైద్యం అందించేందుకు నేచర్ క్యూర్ దవాఖాన సిద్ధంగా ఉంది. హెల్త్‌హబ్ హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం ఇక్కడి వచ్చేలా ఎదుగాలని కోరుతున్నా’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నామని, సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
నేచర్‌క్యూర్ హాస్పిటల్ అంటే చాలా మందికి కరోనా రోజుల్లో ఈ దవాఖాన అందించిన క్వారెంటైన్ సేవలు గుర్తుకువస్తాయన్నారు. కరోనా సమయంలో అయిన వారు సైతం దూరంగా ఉండగా.. నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది బంధువుల్లా అక్కున చేర్చుకున్నారని తెలిపారు. 8 వేలకుపైగా కరోనా పాజిటివ్ పేషెంట్లకు క్వారెంటైన్ సేవలు అందించిందని, 30 వేలకుపైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. కరోనా వంటి క్లిష్టసమయంలో అద్భుతమైన సేవలు అందించిన నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధి కోసం, ఉత్తమ ప్రకృతి చికిత్స అందిస్తున్న రాష్ట్రాల్లో మా వైద్య బృందం పరిశీలనకు సైతం వెళ్లింది. అధ్యయన నివేదిక మేరకు ప్రకృతి వైద్యంలో నంబర్.1గా నిలిపేలా అభివృద్ధి చేస్తున్నాం.
నేచర్ క్యూర్ ఆసుపత్రికి మంచి పేరు ఉంది. ప్రతి సంవత్సరం 3 వేల మంది ఇన్ పేషెంట్లు, 10 వేల మంది ఔట్ పేషెంట్లకు పైగా చికిత్స పొందుతున్నారు. పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాటేజీల కోసం బుక్ చేసుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చికిత్స పొందుతున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడిచారు.
1949లోనే ఈ దవాఖానను ఏర్పాటు చేశారని, అయితే ఆదరణకు నోచుకోక, నాటి ప్రభుత్వాలు పట్టించుకోక పేషెంట్లు ఇబ్బంది పడేవారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్ రావు ఈ హాస్పిటల్‌ను అద్భుతంగా తీర్చదిద్దారని, ప్రైవేటుకు ధీటుగా దీనిని అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలను బాగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. ఏదైనా రోగం వస్తే వందలో 80 మంది సర్కారు దవాఖానకే వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 62 శాతం పెరిగాయని స్పీకర్ పోచారం అన్నారు.