సంగారెడ్డి ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పరీక్ష పత్రాలు బయటకు తెచ్చిన దొంగలను అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పదో తరగతి పేపర్లు లీకు కావడంలేదని, పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లా సదాశివపేట, జహీరాబాద్‌లో నిర్వహించిన వివిధ సమావేశాల్లో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది కుట్రపూరితంగా పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చదువులు నేర్పుతుంటే.. బీజేపీ వాళ్లు పేపర్లు లీకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాలుగేండ్ల క్రితమే ఎయిమ్స్ మంజూరైతే.. ప్రధాని మోదీ ఇప్పుడు హైదరాబాద్‌లో కొబ్బరికాయ కొట్టడం విడ్డూరంగా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిన నాలుగేండ్ల తర్వాత కొబ్బరికాయ కొడుతున్నదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీజేపీది ప్రచారం ఎక్కువ పని తక్కువ అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు మేలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన సొంత రాష్ట్రం యూపీ వైద్యసేవల్లో చివరి స్థానంలో ఉన్నదని, తెలంగాణ ముందున్నదని వివరించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని స్పష్టంచేశారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయే తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ స్వల్ప కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నదని వివరించారు. రేవంత్‌రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అయితే కూలగొడత, లేకపోతే కాలబెడతా అని మాట్లాడటం దారుణమని దుయ్యబట్టారు. మతం పేరుతో లబ్ధిపొందేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, బీదర్ ఎమ్మెల్యే బండప్ప, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.