హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్పై (CM KCR) తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది ‘కారే’ అని చెప్పారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ మండల మాజీ జెడ్పీటీసీ మమతా బ్రహ్మంతోపాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న బ్రహ్మం ప్రస్తుతం బీజేపీలో వున్నారు. ఆయనతోపాటు మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, యువజన నాయకులు పవన్, వార్డు మెంబర్ నర్సింహ, యువజన సంఘాల మండల అధ్యక్షులు మహేష్ గౌడ్, బీజేపీ యూత్ అధ్యక్షుడు ఆంజనేయులు, రేగోడ్ మండల బీసీ సంఘ అధ్యక్షులు శేఖర్ బీజేపీ మోర్చ నాయకులు శేఖర్తోపాటు 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.