Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు ప్రజల దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుందని చెప్పారు. ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలస బతుకులు.. ఒక్క మాటలో చెప్పాలంటే జీవనవిధ్వంసం జరిగిందని చెప్పారు. నాడు పాలకులు మారినా పాలమూరు బతుకులు మాత్రం మారలేదు. తాగు, సాగునీటికి తండ్లాట తప్పలేదని వెల్లడించారు.
కానీ పదేండ్ల స్వరాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలమూరు దశ దిశ మారిందన్నారు. నదీజలాలు ఎదురెక్కుతూ, చెరువులు తడలుగొడుతూ, వాగులు జాలువారుతూ, ఎండిన చేల దాహార్తిని తీర్చుతున్నాయని, పచ్చదనాన్ని పరుస్తున్నాయని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడం గొప్ప విషయమని తెలిపారు. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్దపు అద్భుత విజయమని పేర్కొన్నారు. పాలమూరు జల విజయం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందంటూ మంత్రి హరీశ్ రావు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. నేడు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ..
🌊కృష్ణమ్మ నీళ్ళు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.👏🏼
🌊దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు. అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు… pic.twitter.com/g9wUAgs4mc
— Harish Rao Thanneeru (@BRSHarish) September 16, 2023