Minister Harish Rao | గజ్వేల్, ఏప్రిల్ 21: సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘గజ్వేల్ అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక గజమాల లాంటిది. పూలదండ ఎట్లుంటది? గజామాల ఎట్లుంటది? గజ్వేల్ అభివృద్ధి అనేది పూలమాల కాదు.. ఒక గజమాల లాంటిది. సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కావడం నిజంగా ఈ జిల్లా, నియోజకవర్గ ప్రజల పూర్వజన్మ సుకృతం’ అని పేర్కొన్నారు. ఈ మధ్య ఓ చర్చ మొదలైంది. కేసీఆర్.. గజ్వేల్‌ను మంచిగా చేసినవ్.. ఈ సారి మా వద్దకు వచ్చి పోటీ చేయండి.. అని నాలుగైదు జిల్లాల నాయకులు అడుగుతున్నారు. కేసీఆర్ మా జిల్లాలో పోటీ చేస్తే మేము కూడా బతుకుతాం. మా దగ్గర అంటే.. మా దగ్గర పోటీ చేయాలని కోరుతన్నారు. ఏం హరీశన్న.. మీ జిల్లా మంచిగానే అయింది కదా.. ఇప్పుడు కేసీఆర్‌ను మాకు ఇవ్వరాదే అని నన్ను కూడా అడిగారు. ఇద్దామా? గజ్వేల్ వాళ్లే చెప్పండి. కేసీఆర్‌ను ఉంచుకుందామా? పంపిద్దామా మీరే చెప్పండి. కేసీఆర్ ఎక్కడికి పోయినా కండ్లకు అద్దుకొని గెలిపిస్తారు. సిద్దిపేట నుండి కరీంనగర్ పోతే ఎంపీగా మూడుసార్లు, మహబూబ్‌నగర్‌లో ఎంపీగా, గజ్వేల్‌లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొన్నారు. అందుకు కేసీఆర్ మీ రుణం తీర్చుకొన్నారు. అది నా చేతుల్లో లేదు. కేసీఆర్ ఇష్టం, మీ ఇష్టం. బయట జరుగుతున్న ముచ్చట మాత్రమే నేను చెప్పిన. పెద్ద సార్ ఇష్టం.. మీ ఇష్టం.. ఉంచుకుందామా? పంపిద్దామా? మీ అందరి మాట కూడా చెప్తా.. మావోళ్లయితే అస్సలు పోవద్దంటున్నారు అని సార్ చేవిలో వేస్తా’ అని అన్నారు. దీంతో సభకు హాజరైన ప్రజలంతా ‘కేసీఆర్ మాకే కావాలి. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయాలి. కేసీఆర్‌ను మేం వదులుకోం’ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, అంబలి కేంద్రాలకు వేదికైన గజ్వేల్‌లో నేడు ఎటుచూసినా అద్భుతాలే కనిపిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఒకనాడు గజ్వేల్ ఎలా ఉండేదో.. ఈనాటి ఎలా ఉన్నదో మనం ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలి. తెలంగాణ రాకముందు కూడా నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న. గజ్వేల్‌లో వేరేవాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనాటి గజ్వేల్‌లో రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకొంటే విదేశాల నుంచి, పక్క రాష్ర్టాల నుంచి విలేకరులు వచ్చి ఆ దీనగాథను పేపర్లలో రాసిన పరిస్థితిని చూశాం. రైతులు చనిపోతే కనీసం ఎక్స్‌గ్రేషియో ఇవ్వకపోతుండే అప్పటి ప్రభుత్వాలు. నాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు, ఆకలి చావులు నిత్యకృత్యం. ఇవాళ ఏం చూస్తున్నాం? పక్క రాష్ర్టాల నుంచి రాజకీయ నాయకులు, రైతులొచ్చి వావ్ గజ్వేల్.. శభాష్ గజ్వేల్ అంటూ పొగుడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నేతలు వచ్చి కొండపోచమ్మ, మల్లన్నసాగర్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. గజ్వేల్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు పోయి సెల్ఫీలు తీసుకొంటున్నారు. కోమటిబండ మహా అద్భుతమైపోయింది. కోమటిబండను చూడని నాయకులు లేరు. ఎన్నో రాష్ర్టాల నుంచి ఇంజినీర్లు వచ్చి మిషన్ భగీరథను చూసి నేర్చుకొనేలా సీఎం కేసీఆర్ చేసిండు.
నిజంగా 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారు. దుబాయ్ పోయినోళ్లు మూడేండ్ల తరువాత వచ్చి చూస్తే ఇది గజ్వేలేనా! లేక ఎక్కడైనా దిగామా? అని అనుకొనేంతలా అభివృద్ధి చేశారు. నేడు రింగ్‌రోడ్డులో వస్తే గజ్వేలా? హైదరాబాదా? అని అర్థం కానంత గొప్పగా మారిపోయింది. ప్రజ్ఞాపూర్‌కు బైపాస్ రోడ్డు వచ్చినంక చాలామంది అటుపోయి ఇటు ఎక్కుతుర్రు.. ఇటు పోయి అటు ఎక్కుతుర్రు. మొన్ననే మా డ్రైవర్ పరేషాన్ చేసిండు. నేను చూసి బండి ఎక్కడికో పోతున్నది అనేకాడికి వచ్చింది. అంతగా రూపురేఖలు మారాయి. అంతగొప్పగా గజ్వేల్‌ను కేసీఆర్ మార్చి చూపించిండు. ఎనకటి రోజుల్లో బతుకమ్మ, గణేశ్ పండుగలొస్తే నిమజ్జనం చేయాలంటే చుక్క నీరు లేక ఎండిపోయిన చెరువులు కనిపించేవి. ఇవాళ మండుటెండల్లో హల్దీ, కూడవెల్లి వాగులు మత్తడి దుంకుతూ కనిపిస్తున్నాయి. హల్దీ వాగుపై మత్తడి దుంకుతుంటే హైదరాబాద్ వాళ్లు పరేషాన్ అవుతూ సెల్ఫీలు తీసుకొంటున్నారు. హల్దీ వాగు 96 కిలోమీటర్లు ప్రవహించి నిజాంసాగర్‌లో కలిసింది. ఎంత గొప్పగా మారిందో మీ అందరికి అనుభవంలో ఉన్నది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో హార్టికల్చర్, పారెస్ట్ యూనివర్సిటీలు పెట్టిండు. దేశంలోనే అతిపెద్ద మల్లన్నసాగర్‌ను అందించిండు. కొండపోచమ్మ సాగర్‌ను అందించిండు. ఎడ్యుకేషన్ హబ్‌ను అందించిండు. గజ్వేల్‌కు రైలు కూడా తెచ్చిండు. రాలేదా మొన్న రైలు? రైలు వచ్చి మొన్న గజ్వేల్‌లోనే ఆగింది. ఎరువులకు ఇబ్బంది లేకుండా పోయింది.
గతంలో యాసంగి సీజన్లో గజ్వేల్ మండలంలో 2,300 ఎకరాల్లో వరిసాగు చేస్తే.. సీఎం కేసీఆర్ కృషివల్ల ఇప్పుడు 15,000 ఎకరాల్లో వరి సాగు అవుతున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘ఒకనాడు గతుకులకు నిలయంగా ఉన్న గజ్వేల్‌ను, కేసీఆర్ నేడు బతుకులకు నిలయంగా మార్చిండు. నాడు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడ చూసినా మోచేతి లోతు గుంతలు ఉండేవి. వాటిని పూడ్చేందుకు పైసలివ్వని ప్రభుత్వాలను చూశాం. నర్సారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజ్ఞాఫూర్ నుంచి గజ్వేల్ వరకు గుంతలే కనిపించేవి. కేసీఆర్ రాకతో ఏ ఊరికి పొయినా రోడ్లు అద్భుతంగా మారిపోయాయి. కలలో కూడా ఊహించని పనులు జరిగినయంటే అది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. గజ్వేల్ ప్రజలంటే కేసీఆర్‌కు ఎంతో ప్రేమ. తనను రెండుసార్లు గెలిపించినందుకు గజ్వేల్ ప్రజల కలలను సాకారం చేసిండు. మీపై ప్రేమతో ఎన్నో పథకాలను అమలు చేసిండు. 60 ఏండ్లు వెనక్కి ఉన్న గజ్వేల్‌ను, 60 ఏండ్లు ముందుకు తీసుకెళ్లిండు. ఆనాడు సంజీవరావు, విజయరామరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి వంటివారంతా కలిసి ఎంతపని చేశారో, అంతకు నాలుగింతలు పని చేసిండు సీఎం కేసీఆర్’ అని కొనియాడారు.