సిద్దిపేట: అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనే తెలంగాణకు (Telangana) శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు (Congress) రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ అని విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటున్నారని, మన రాష్ట్రంలో 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు.
రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఉమ్మడి పాలనలో నాడు కరువుతో ఉన్నామని, నేడు సస్యశ్యామలంగా మార్చుకున్నామని తెలిపారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని హెచ్చరించారు. నేడు అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు పెంచుకోబోతున్నామని వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది స్థానాలు బీఆర్ఎస్ గెలువబోతున్నదని చెప్పారు.